NTV Telugu Site icon

Justin Trudeau: “పెద్ద దేశాలు, అంతర్జాతీయ చట్టాలు” అంటూ.. మరోసారి భారత్‌పై కెనడా ప్రధాని వ్యాఖ్యలు..

India Vs Canada

India Vs Canada

Justin Trudeau: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీస్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా దేశాల మధ్య తీవ్ర దౌత్య వివాదానికి కారణమైంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నాయి. తమ పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడం వివాదాస్పదం అయింది. అంతే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను ఆ దేశం బహిష్కరించింది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్, కెనడియన్ దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాల్సిందిగా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియాను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘‘పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఎటువంటి పరిణామాలు లేకుండా ఉల్లంఘించగలిగితే, ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ మరింత ప్రమాదకరం’’ అని అన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్ ప్రారంభించిన సందర్భంగా కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా తరుపున అమెరికా ఈ విషయాన్ని భారత్‌తో చర్చించాలా..? వద్దా.? అనే ప్రశ్నకు స్పందించిన ట్రూడో.. కెనడా పౌరుడి హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందనే విశ్వసనీయ ఆరోపణల గురించి మాకు మొదటి నుంచి తెలుసు, ఈ విషయం గురించి తమతో కలిసి పనిచేయాల్సిందిగా భారత్‌ని కోరామని, అమెరికా వంటి మా మిత్ర దేశాలతో ఈ విషయంపై సంప్రదించామని ఆయన అన్నారు.

Read Also: Israel-Hamas War: గాజా ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయిల్ సైన్యం..

ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని చట్టబద్ధమైన సంస్థలు, దర్యాప్తు సంస్థలతో పనిచేస్తున్నామని ట్రూడో వెల్లడించారు. కెనడా ఎల్లప్పుడు చట్టబద్ధమైన పాలన కోసం నిలబడే దేశమని, పెద్ద దేశాలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే ప్రతి ఒక్కరికి ప్రమాదకరమని ఆయన అన్నారు. భారత్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి 40 మంది కెనడా దౌత్యవేత్తల ప్రత్యేక రక్షణల్ని రద్దు చేయడంపై నిరాశ చెందినట్లు ట్రూడో అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ప్రస్తుతం ఏం స్పందించలేదు. గతంలో ఈ వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా తమకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ గతంతో తప్పుపట్టింది. కెనడా అసంబద్ధ రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించింది.