Michael Clarke wants Want Virat Kohli To Score A Duck: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగియగా.. ప్రస్తుతం భారత్ ఛేజింగ్ చేస్తోంది. టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. భారత్ ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది.
ప్రస్తుత ప్రపంచకప్ జట్టులో ఉన్న భారత్ ఆటగాళ్లలో చెపాక్‌లో సెంచరీ చేసిన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో కోహ్లీ డకౌట్ కావాలని కోరుకున్నాడు. అంతేకాదు ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే.. సెంచరీ చేయొద్దని కోరుకున్నాడు.
బొరియా మజూందార్ షోలో మైకేల్ క్లార్క్ మాట్లాడుతూ… ‘నేను నిజమే చెబుతున్నా. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయితే చూడాలనుంది. తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ సెంచరీ చేసినా పర్లేదు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడాల్సి వస్తే మాత్రం సెంచరీ చేయొద్దని కోరుకుంటా. ఫైనల్లో కూడా విరాట్ డకౌట్ కావాలి’ అని వింత వ్యాఖ్యలు చేశాడు. అయితే కోహ్లీ ఈ మ్యాచులో ఇప్పటికే డబుల్ డిజిట్ స్కోర్ చేశాడు. దాంతో మైకేల్ క్లార్క్ ఆశ నెరవేరకుండా పోయింది.
Also Read: IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
విరాట్ కోహ్లీపై మైకేల్ క్లార్క్ ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. ‘విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటర్. అతడు జీనియస్ మాత్రమే కాదు గొప్ప యోధుడు కూడా. వన్డేల్లో విరాట్ అత్యుత్తమంగా ఆడుతాడు. టెస్టు, టీ20 ఫార్మాట్‌లోనూ అదరగొట్టినా.. వన్డే క్రికెట్‌లో వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ప్లేయర్’ అని క్లార్క్ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో కోహ్లీ ఇప్పటివరకు 13 వేలకు పైగా రన్స్ చేశాడు. ఇందులో 47 సెంచరీలు ఉన్నాయి. ప్రపంచకప్ 2023లో 50 సెంచరీల మార్క్ అందుకున్నా ఆశ్చర్యం లేదు.
