Harbhajan Singh Picks 4 Favourites For ICC World Cup 2023 Title: భారత గడ్డపై అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. కప్ కొట్టాలని ప్రణాళికలు రచిస్తునాయి. టోర్నీ ఆరంభానికి మరికొన్ని రోజుల సమయమే ఉండటంతో.. ఏ జట్టు విజేతగా నిలుస్తుంది, ఏ జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరతాయనే దానిపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌కు వస్తాయని ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అంచనా వేశాడు. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అంచనాను తెలిపాడు.
దాయాది పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్స్‌కు రాదని హర్భజన్ సింగ్ అన్నాడు. హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ 2023కు ముందు భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ రసవత్తరంగా ఉంటుంది. ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ పోటీదారులలో ఆస్ట్రేలియా ఒకటి. భారత్, ఇంగ్లండ్ మొదటి నాలుగు స్థానాలలో ఉంటాయి. పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ చేరుతుందని చాలామంది భావిస్తున్నారు. అయితే పాక్ టీ20ల్లో బాగా ఆడుతున్నా.. వన్డే ఫార్మాట్‌లో మాత్రం యావరేజ్ టీమ్. సెమీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్ ఉంటుంది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుతాయి’ అని చెప్పాడు.
Also Read: Today Gold Price: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో తులం పసిడి ఎంతుందంటే?
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ ముగిసేసరికి టాప్-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్స్‌లో మొదటి, నాలుగో స్థానాల్లో (1st v 4th) నిలిచిన జట్ల మధ్య మొదటి సెమీస్ మ్యాచ్ జరుగుతుంది. 2, 3 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య (2nd v 3rd) రెండో సెమీస్ జరుగుతుంది. సెమీ ఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఫైనల్స్ ఆడుతాయి. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగుస్తుంది. ఇక అక్టోబర్ 8న భారత్ తన మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.