అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈనెల 29న కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు వర్చువల్ (ఆన్‌లైన్) సమావేశాన్ని నిర్వహించనుంది. కాగా.. టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించడంలో జాప్యం జరుగుతుండటంతో.. ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత్ నిరాకరించడమే ఆలస్యానికి కారణం. 2008 ముంబైలో ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదు.
బీసీసీఐ ఈ టోర్నమెంట్‌లో హైబ్రిడ్ మోడల్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా మ్యాచ్‌లు మరో దేశంలో నిర్వహించుతారు. ఇండియా UAEలో నిర్వహించాలని కోరుతుంది. మరోవైపు.. ఈ నిర్ణయంపై పీసీబీ ఇంకా అంగీకరించలేదు. ఇదిలా ఉంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ గురించి చర్చించడానికి ఐసీసీ బోర్డు నవంబర్ 29న సమావేశమవుతుందని ఐసీసీ ప్రతినిధి మంగళవారం పీటీఐకి చెప్పారు. డిసెంబర్ 1న జై షా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఈ సమావేశం జరుగుతుండటంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆసక్తి చూపనున్నారు.
Read Also: Liam Livingstone: RCB ‘హీరో’నే తీసుకుంది… 15 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్
గత ఏడాది భారత్ ఆసియా కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. అయితే.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ కరాచీ, రావల్పిండి, లాహోర్‌లోని స్టేడియాలను పునరుద్ధరించింది. దీనికి పీసీబీ మిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. 1996లో పాకిస్థాన్ సహ-ఆతిథ్యమిచ్చిన ప్రపంచ కప్ తర్వాత అక్కడ జరుగుతున్న తొలి ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ. 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన దాడి కారణంగా కొన్నాళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వకుండా కోల్పోయిన పాకిస్థాన్.. తాజాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సహా పెద్ద జట్లకు తమ దేశంలో ఆతిథ్యం ఇచ్చింది.
ఐసీసీ 2021లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్‌కు ఇచ్చింది. అందువల్ల పాకిస్తాన్‌లోనే అన్ని మ్యాచ్‌లను నిర్వహించడానికి అక్కడి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి పీసీబీకి ఒత్తిడి కలిగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్‌కు రాకపోతే.. భవిష్యత్తులో జరిగే ఐసీసీ పోటీలకు తమ జట్టును అక్కడికి పంపబోమని పీసీబీ తేల్చి చెప్పింది. మరోవైపు.. పాకిస్తాన్ గత సంవత్సరం వన్డే ప్రపంచ కప్ కోసం భారతదేశంలో పర్యటించింది. ఏడేళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించింది.