Site icon NTV Telugu

ICC ODI Rankings: ఆడకున్నా అదరగొట్టిన రోహిత్ శర్మ.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma 2nd spot in ICC ODI Rankings 2025: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. 784 రేటింగ్ పాయింట్లతో యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అగ్ర స్థానంలో నిలిచాడు. ఇటీవలి కాలంలో పెద్దగా వన్డే మ్యాచ్‌లు ఆడని సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. హిట్‌మ్యాన్‌ ఖాతాలో 756 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో విఫమయిన పాకిస్థాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ (751 పాయింట్స్) మూడో స్థానానికి పడిపోయాడు. మొన్నటి వరకు బాబర్‌ రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో ఉన్నాడు.

తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. కింగ్ ఖాతాలో 736 పాయింట్స్ ఉన్నాయి. శ్రేయస్‌ అయ్యర్‌ (708 పాయింట్స్) ఎనిమిదో స్థానంలో ఉండగా.. కేఎల్‌ రాహుల్‌ (638 పాయింట్స్) 15వ స్థానంలో ఉన్నాడు. టాప్-10లో నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. డారిల్‌ మిచెల్‌ (720 పాయింట్లు), చరిత్‌ అసలంక (719 పాయింట్లు), హ్యారీ టెక్టర్‌ (708 పాయింట్లు), ఇబ్రహీం జద్రాన్ (676 పాయింట్లు), కుశాల్‌ మెండిస్‌ (669 పాయింట్లు) టాప్-10లో ఉన్నారు.

Also Read: Suresh Raina: ఆ మాత్రం కూడా మీకు తెలియదా?.. సురేశ్‌ రైనాపై ఈడీ ప్రశ్నల వర్షం!

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు వన్డే క్రికెట్‌ మీదే దృష్టి సారించారు. అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్ కోసం ప్రస్తుతం సన్నద్ధమవుతున్నారు. రోహిత్‌, కోహ్లీలు వన్డేల్లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడారు. 2023 నుంచి వన్డేల్లో హిట్‌మ్యాన్‌ 61.47 సగటుతో ఆడుతున్నాడు. 117 స్ట్రైక్‌ రేట్‌తో 1702 రన్స్ చేశాడు.

Exit mobile version