NTV Telugu Site icon

Bhavya Bishnoi: ఐఏఎస్‌తో పెళ్లికి రెడీ అయిన మెహ్రీన్ మాజీ ప్రియుడు.. 3 లక్షల మందికి ఆహ్వానం!

Marriage

Marriage

Bhavya Bishnoi: హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ మనవడు, బీజేపీ ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఐఏఎస్‌ ఆఫీసర్‌ పరి బిష్ణోయ్‌ని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ నెల 22న వీరి వివాహం జరగనుంది. అయితే ఇందులో పెద్ద విశేషమేముంది అనుకోవచ్చు..కానీ ఈ పెళ్లికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఢిల్లీతో సహా రెండు రాష్ట్రాలకు ఇన్విటేషన్లు వెళ్లాయి. వేధిక రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో కాగా .. పుష్కర్, అదంపుర్‌, ఢిల్లీ నగరాలు మూడు రిసెప్షన్లకు వేదిక కానున్నాయి. ఈ వేడుకల నిమిత్తం మూడు లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. దీంతో ఇప్పుడు ఈ వివాహం చర్చనీయాంశంగా మారింది.ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. భవ్య.. అదంపుర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తాత భజన్‌ లాల్‌ హర్యానాకు పదమూడేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. తండ్రి కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ భాజపా నేత, మాజీ ఎంపీ.

Read Also: Naga Chaitanya: ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు

పరి బిష్ణోయ్‌ది రాజస్థాన్‌. ఆమె 2019లో సివిల్స్‌ సాధించారు. సిక్కిం క్యాడర్‌ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. పెళ్లి కూతురు రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం జరగనుంది. అలాగే ఆ రాష్ట్రంలోని పుష్కర్‌ నగరంలో ఒక రిసెప్షన్ నిర్వహించనున్నారు. భజన్‌లాల్ కాలం నుంచి బిష్ణోయ్ కుటుంబానికి మంచి పట్టున్న అదంపుర్‌ రిసెప్షన్‌కు వేదిక కానుంది. దాంతో ఆ నియోజకవర్గంలోని 80కి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తున్నారు. నా తండ్రి భజన్‌లాల్ కూడా నా వివాహం సమయంలో అన్ని ఊర్లు తిరిగి ప్రజలను ఆహ్వానించారని.. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని.. ఇప్పుడు తాను కూడా అదే చేయబోతున్నాని పెళ్లి కుమారుని తండ్రి కుల్‌దీప్ బిష్ణోయ్‌ తెలిపారు. ఢిల్లీ రిసెప్షన్‌కు పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. భవ్య బిష్ణోయ్‌కు 2021లో సినీనటి మెహ్రీన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే కొద్దినెలలకే వారి ఎంగేజ్‌మెంట్ రద్దయింది.