IAF Tejas Delay: ఆపరేషన్ సింధూర్ భారత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ విజయంలో ఇండియన్ ఏర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించింది. తాజా సమాచారం ఏమిటంటే భారత వైమానిక దళంలో తేజస్ టెన్షన్ మొదలైంది. వైమానిక దళంలో ఈ టెన్షన్‌కు కారణం ఏంటో తెలుసా.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. నిజం అండీ బాబు.. ఈ విషయాన్ని స్వయంగా భారత వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా షో కార్యక్రమంలో వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్న సమయంలో ఆయన స్వయంగా హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఉన్నతాధికారులతో చేసిన సంభాషణ తాజాగా వైరల్ అయింది. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు.. ఇండియన్ ఏర్‌లో తేజస్ టెన్షన్‌కు కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chiranjeevi : చెప్పాల్సింది చెప్పాను ఇక చెప్పడానికి ఏం లేదు.
వాగ్దానం నిలుపుకోలేదు..
బెంగళూరులో నిర్వహించిన ఏరో ఇండియా షో కార్యక్రమంలో వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. వాగ్దానం చేసిన 83 తేజస్ Mk 1A యుద్ధ విమానాలను HAL ఇంకా వైమానిక దళానికి అందించలేదని విమర్శించారు. HAL ఈ ప్రాజెక్టుకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన సూటీగా ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వైమానిక దళానికి ఒక్క తేజస్ ఎంకే 1ఎ విమానం కూడా అందలేదు. గత వారం చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో వైమానిక దళం 36 మిగ్-21 యుద్ధ విమానాలను రిటైర్ చేసింది. కార్యక్రమంలో వైమానిక దళ అధిపతి స్వయంగా మిగ్-21ను గాల్లోకి ఎగరవేసి, తుది వందనం సమర్పించారు.
ముగిసిన మిగ్ సేవలు..
గత వారం వైమానిక దళం తన మిగ్-21 స్క్వాడ్రన్‌ను విరమించుకుంది. 1960ల నుంచి వైమానిక దళానికి వెన్నెముకగా మారి సేవలందించిన మిగ్-21లు ఇప్పుడు పాతబడిపోయాయి, అలాగే ప్రమాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. భారతదేశం 1963లో ప్రవేశపెట్టిన 874 మిగ్-21లను ఇప్పటి వరకు వాడింది. వీటిలో HAL 60% కంటే ఎక్కువ తయారు చేసింది. 1971 యుద్ధం నుంచి కార్గిల్ యుద్ధం, బాలకోట్ వైమానిక దాడి, ఇటీవలి ‘ఆపరేషన్ సింధూర్’ వరకు… మిగ్-21 భారతదేశానికి విశ్వసనీయ ఆయుధం, అది భారత్ తరుఫున అడుగు పెట్టిన ప్రతీసారి విజయం భారత్‌ను వరించింది. ఇప్పుడు అది చరిత్రగా మారింది.
ప్రస్తుతం ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయో తెలుసా..
ప్రస్తుతం భారత వైమానిక దళం వద్ద 42 ఫైటర్ స్క్వాడ్రన్లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం వీటిలో 29 స్క్వాడ్రన్లతో మాత్రమే పనిచేస్తున్నాయి. ఒక్కొక్క స్క్వాడ్రన్లు 16-18 విమానాలను కలిగి ఉంటుంది. మిగ్-21 యుద్ధ విమానాలను దశలవారీగా తొలగించడం వల్ల ఈ కొరత మరింత తీవ్రమైందని వైమానిక దళ అధికారులు చెబుతున్నారు. హెచ్ఏఎల్ కొత్త విమానాలు సకాలంలో అందజేయక పోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. 2021 నుంచి ₹47 వేల కోట్ల విలువైన 83 తేజస్ Mk 1A విమానాలకు HAL ఆర్డర్ తీసుకుంది. కానీ వాటిలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా డెలివరీలు చేయలేక పోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే డెలివరీలు 2024లో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కావాల్సి ఉంది. వైమానిక దళం వాటిని త్వరగా దళంలో చేర్చుకోవాలని కోరుకుంటోంది, కానీ ఈ 83 విమానాలలో మొదటి రెండు మాత్రమే ఈ ఏడాది వారి దళంలో చేరుతాయని అంచనా. విమానాల సరఫరాలో HAL ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. ఇంజిన్ల కొరత. ఈ విమానాల కోసం ఇంజిన్లను USలోని GE ఏరోస్పేస్ నుంచి సోర్సింగ్ చేయాలి. HAL విమానాల డెలివరీ వేగాన్ని ఈ ఇంజిన్లు నియంత్రిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు HAL కేవలం మూడు ఇంజిన్లను మాత్రమే GE ఏరోస్పేస్ నుంచి అందుకుంది.
మరో ప్రధాన ఒప్పందంపై సంతకం చేసిన HAL..
గత వారం ప్రభుత్వం HAL తో మరో ప్రధాన ఒప్పందంపై సంతకం చేసింది. ఇందులో రూ.66,500 కోట్ల విలువైన 97 లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) Mk1A విమానాల కొనుగోలు కూడా ఉంది. HAL ఇప్పుడు 180 యుద్ధ విమానాలను (83 పాత తేజస్‌తో సహా) వైమానిక దళానికి సకాలంలో డెలివరీ చేయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం.. ఎందుకంటే భారతదేశం.. వైమానిక దళ సామర్థ్యంలో పాకిస్థాన్ కంటే వెనుకబడి ఉండకూడదు. పాక్ వద్ద 25 స్క్వాడ్రన్లు ఉండగా, ప్రస్తుతం భారతదేశం వద్ద 29 మాత్రమే ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్ చైనా నుంచి 35 – 40 J-35 ఐదవ తరం ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని HAL విమానాల డెలివరీలో వేగం ప్రదర్శించాలని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ఆపరేషన్ సింధూర్ నుంచి భారత్ నేర్చుకున్న పాఠాలు..
“ఆపరేషన్ సింధూర్” ఆధునిక యుద్ధంలో వైమానిక శక్తి, సాంకేతికతల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పింది. భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆపరేషన్ సింధూర్‌లో పాక్ రాడార్ సైట్‌లు, హ్యాంగర్లకు చిక్కకుండా.. లక్ష్యాలపై కచ్చితమైన దాడులు ఎలా చేయాలో ఇండియా చేసి చూపించింది. భారత వైమానిక శక్తి ముందు శత్రువుకు బలం సరిపోలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇండియా తన వైమానిక శక్తిని అత్యున్నత స్థాయిలో కొనసాగించాలని రక్షణ వర్గాలు సూచిస్తున్నాయి.