Palla Srinivas: స్టీల్ ప్లాంట్ సంక్షోభం రాజకీయ వేడిని రాజేస్తోంది. విశాఖ ఉక్కు మూసివేయడమే అంతిమ నిర్ణయం అయితే తన పదవికి రాజీనామా చేస్తానని గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. రాజీనామా చేసి కార్మికులతో కలిసి పరిరక్షణ పోరాటంలో కొనసాగుతానని ఆయన చెప్పారు. రెండు రోజులుగా ఆర్‌ఐఎన్‌ఎల్‌లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రా మెటీరియల్ కొరతను కారణంగా చూపించి బ్లాస్ట్ ఫర్నేస్ -3ని యాజమాన్యం మూసివేసింది. సిబ్బంది వీఆర్‌ఎస్ అమలు సహా యాజమాన్య నిర్ణయాలపై కార్మికుల్లో ఆందోళన పెరుగుతోంది.
Read Also: Nandyal: కూలిస్తే దూకి చస్తా.. ఇంటిపైకి ఎక్కి అధికారులను బెదిరించిన యజమాని
దశలవారీగా ప్లాంట్ షట్ డౌన్ చేసేందుకు యాజమాన్యం ప్రయత్నం చేయడంపై కార్మిక వర్గాలు ఆందోళన ఉధృతం చేస్తున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. దీంతో విశాఖ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు అలెర్ట్ తయారు అయ్యారు. కూర్మన్నపాలెం దగ్గర స్టీల్ కార్మికుల దీక్షా శిబిరం దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే పల్లా, ఎంపీ భరత్ ఆందోళనలో ఉన్న కార్మికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మరోవైపు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కరణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు వ్యతిరేకిస్తూ గాజువాక జంక్షన్‌లో సీఐటీయూ మహాధర్నాకు పిలుపునిచ్చింది.