Site icon NTV Telugu

I-PAC: చంద్రబాబు-ప్రశాంత్‌ కిషోర్ భేటీ.. ఐ-ప్యాక్‌ కీలక ప్రకటన

Ipac

Ipac

I-PAC: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఈ రోజు ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది.. హైదరాబాద్‌ నుంచి నారా లోకేష్‌తో పాటుగానే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆయన.. లోకేష్‌ వాహనంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లారు.. ఇక, చంద్రబాబు, లోకేష్‌, పీకే మధ్య దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిగాయి.. ఏపీలో తన దగ్గర ఉన్న సర్వే నివేదికలను పీకే.. చంద్రబాబు ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. పీకేతో పాటు.. ఇప్పటికే టీడీపీతో కలిసి పనిచేస్తున్న టీమ్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టుగా చెబుతున్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తన వ్యూహాలను ప్రశాంత్‌ కిషోర్‌ అందిస్తారనే చర్చ సాగుతుండగా.. ఈ పరిణామాలపై ఐప్యాక్‌ కీలక ప్రకటన చేసింది.

Read Also: AP Elections Alliance: ఏపీలో కొత్త పొత్తులు..! ఢిల్లీలో మంతనాలు

చంద్రబాబుతో ప్రశాంత్‌ కిషోర్‌ సమావేశమైన కాసేపటికే సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది ఐప్యాక్‌ టీమ్‌.. ”ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీతో కలిసి పనిచేస్తున్నాం.. 2024 ఎన్నికల్లో​ సీఎం వైఎస్‌ జగన్‌ గెలుపుకోసమే మేం పనిచేస్తాం” అని తన ట్వీట్‌లో పేర్కొంది ఐప్యాక్‌.. కాగా, ప్రశాంత్‌ కిషోర్‌ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు.. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు.. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో బీహార్ రాజకీయాలపై దృష్టిసారించారు.. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ కావడం.. సుదీర్ఘంగా చర్చలు జరపడం.. లోకేష్‌తోనే కలిసి రావడం.. కలసి వెళ్లడం చూస్తుంటే.. ఆయన టీడీపీకి దగ్గరవుతున్నారనే చర్చ సాగుతోంది. చంద్రబాబు, పీకే భేటీ తర్వాత ఐప్యాక్‌ ప్రకటనతో.. పీకేకు ఐప్యాక్‌కు మధ్య సంబంధాలు కూడా తెగిపోయినట్టు తెలుస్తోంది.

Exit mobile version