Hydra Marshals Comments on Salary Cuts: హైడ్రా మార్షల్స్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వేతనాలు తగ్గించడంతో ఆగ్రహించిన మార్షల్స్.. నేడు తమ విధులను బహిష్కరించారు. దాంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ సేవలు నిలిచిపోవడంతో పాటు 51 హైడ్రా వాహనాలు కూడా ఆగిపోయాయి. నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. విధుల బహిష్కరణపై మార్షల్స్ స్పందించారు. తమ డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం తమకు రూ.45 వేలు జీతం ఇవ్వాలని, ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారన్నారు. ఇచ్చేది తక్కువ అంటే.. ఇప్పుడు మరలా తగ్గించడం దారుణం అని పేర్కొన్నారు. తమకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం అని మార్షల్స్ స్పష్టం చేశారు.
‘మాకు హైడ్రా నుంచి పే స్కేల్ రూ.22500 అని జీఓ వచ్చింది. మొన్నటి వరకు రూ.29000 జీతం వచ్చేది. దానిపై మాట్లాడానికి రంగనాథ్ గారిని కలవడానికి వచ్చాము. మేము ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాము కాబట్టి పెన్షన్ వస్తుంది. కానీ కొందరు మా పెన్షన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మేము దేశానికి చేసిన సేవను గుర్తించి పెన్షన్ ఇస్తున్నారు. కూలీ పని చేసుకునే వాళ్లకు కూడా జీతం పెరుగుతుంది.. మాకు ఇచ్చే జీతం తగ్గించారు. మాకు సరైన గౌరవం ఇవ్వాలి. మాన్సూన్ ఎమర్జెన్సీ అని కనీసం వీక్ ఆఫ్ ఇవ్వడం లేదు. పైగా గౌరవం ఇవ్వడం లేదు. కొందరు అధికారులు రెస్పెక్ట్ ఇవ్వకుండా.. అరేయ్, ఒరేయ్ అంటున్నారు. మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటాదని గుర్తుంచుకోవాలి’ అని మార్షల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Bhatti Vikramarka: ఐఏఎస్ అంటే ఉద్యోగం కాదు.. సమాజానికి అందించే బాధ్యత!
‘కరోనా సమయంలో ఎవ్వరూ ఇంటి నుండి బయటకు రాలేదు. కానీ మేము ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చి పని చేశాం. మా సేవకు గుర్తింపుగా జీతాలు పెంచడం పోయి, తగ్గించారు. మా డైరెక్టర్ జనరల్ ఆదేశాల ప్రకారం రూ.45 వేలు జీతం ఇవ్వాలి. కానీ ఇక్కడ చాలా తక్కువ జీతం ఇస్తున్నారు. అందులో ఇప్పుడు తగ్గించడం దారుణం.మాకు సరిపడ జీతం ఇస్తేనే పని చేస్తాం. గతంలో 30 శాతం జీతం పెంచిపిస్తా అని రంగనాథ్ గారు చెప్పారు. కానీ పెంచడం పక్కన పెట్టి, తగ్గించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రెండు రోజులు, మూడు రోజులు కంటిన్యూగా పని చేస్తున్నాము. జీహెచ్ఎంసీ ఈవీడిఏంలో పని చేసినప్పుడు 8 గంటల డ్యూటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు 12 గంటలు, ఆపై సమయం పని చేయిస్తున్నాము. మాకు న్యాయం చేయాలి’ అని మార్షల్స్ కోరారు.
