NTV Telugu Site icon

AV Ranganath: కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ సుడిగాలి పర్యటన..

Hydra

Hydra

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేశారు. నగరశివారులోని 15 చెరువుల ఆక్రమణ పై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ అక్కడికి వెళ్లారు. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సాయంత్రం వేళ పర్యటించారు. ఫాక్స్ సాగర్, దూలపల్లి అశోక్ విల్లాస్ దగ్గర నాలా కబ్జాను, పలు చెరువులను ఆయన పరిశీలించారు. చెరువుల కబ్జాలపై స్థానికుల ఫిర్యాదుతో మంచి స్పందన వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్, కొంపల్లి మునిసిపల్ కమీషనర్.. ఇరిగేషన్ డి.ఓ, రెవెన్యూ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: Top Headlines @ 9PM: టాప్‌ న్యూస్

మరోవైపు.. హైదరాబాద్‌ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు ఎక్కవవుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి ఫిర్యాదు దారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో తక్కువగా
వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుండటంతో వందల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. అంతేకాకుండా.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. రంగనాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత పెంచారు. మధురానగర్‌ కాలనీ డీ-81లోని ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో కూడిన ఔట్‌ పోస్టు కూడా ఏర్పాటు చేశారు.

Read Also: Hyderabad: రేపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ..