NTV Telugu Site icon

Kings & Queens Pub: పబ్బుల్లో న్యూసెన్స్‌కు మించి గలీజ్ పనులు జరుగుతున్నాయా?

Pubs

Pubs

Kings & Queens Pub: హైదరాబాద్‌లోని పబ్బులు గబ్బుకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయా?.. న్యూసెన్స్‌కు మించి పబ్బుల్లో గలీజ్ పనులు జరుగుతున్నాయా?.. కొంత మంది యువతులను ఎరగా వేసి కస్టమర్లను నిలువునా దోచేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని పబ్బులు నగరాన్ని గబ్బు పట్టిస్తు్న్నాయి. రూల్స్‌ను కూడా పట్టించుకోకుండా పబ్బుల్లో గలీజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటీవల పబ్బుల ఆగడాలు శృతి మించుతున్నాయి. నిన్నటి వరకు న్యూసెన్స్‌కు అడ్డాగా ఉన్నా పబ్బులు ఇప్పుడు కొత్తరకం దందాకు తెరలేపాయి. గలీజ్ దందాతో కస్టమర్లను మోసం చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. డేటింగ్‌ యాప్‌లో లేదంటే కస్టమర్లకు వలపు వల విసురుతున్నాయి. కస్టమర్ పబ్‌కు వచ్చిన తర్వాత బిల్లుతో నిట్టనిలువున ముంచేస్తు్న్నాయి. నగరంలో ఎన్నో పబ్‌లు గలీజ్ పనులతో దందా నిర్వహిస్తున్నాయి. అమ్మాయితో కలిసి మందు కొట్టామని కలల్లో విహరించేలోపే పబ్‌ వేసే బిల్లుతో కస్టమర్‌కు మత్తు దిగుతోంది.

నిన్న మోష్ పబ్‌.. నేడు కింగ్స్‌ అండ్ క్వీన్స్ పబ్‌ వచ్చే జనాలను నిట్టనిలువున ముంచడమే పనిగా పెట్టుకున్నాయి. జేబులను గుల్ల చేసి పంపుతున్నాయి. కూకట్‌పల్లిలో కేపీహెచ్‌బీలోని మంజీరా మాల్‌లో కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ కస్టమర్లను ముంచడంలో ఆరితేరిపోయింది. ముంబయి తరహా డ్యాన్స్ షోలను ఏర్పాటు చేస్తున్నామంటూ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అమ్మాయిలతో కస్టమర్లకు వల వేసి పబ్‌కు వచ్చేలా ప్లాన్‌లు అమలు చేస్తున్నట్లు తెలిసింది. పబ్‌కు వచ్చే కస్టమర్లకు అమ్మాయిలే ఫోన్‌ చేస్తారు. ఇవాళ పబ్‌కు వస్తున్నారా.. అంటూ ఆరా తీస్తారు. డ్యాన్సులకు మించి ఇంకేమైనా కావాలా అంటే మాత్రం మేనేజర్లతో మాట్లాడాలని చెబుతున్నారు. సింగిల్‌గా వచ్చేవారి కింగ్స్‌ అండ్ క్వీన్స్ పబ్ టార్గెట్ చేస్తోంది. పబ్‌లతో ఒప్పందం చేసుకున్న అమ్మాయిలే పాత కస్టమర్లకు ఫోన్‌ చేస్తున్నారు. మొన్న వచ్చారు కదా.. ఇవాళ కూడా వస్తారా అని అడుగుతారు. నాతో పాటు మా ఫ్రెండ్‌ కూడా వస్తోందని.. కలిసి మందు కొడదామని ఊరిస్తారు. బిల్లు ఎక్కువైందని ఎవరైనా చెబితే మీరు వైన్ ఎక్కువగా తీసుకున్నారని.. ఫుడ్‌ ఎక్కువగా తిన్నారని మాయమాటలు చెప్పేస్తారు.

Read Also: BJP: కోయంబత్తూర్ పేలుళ్ల టెర్రరిస్ట్ అంత్యక్రియలకు ఈ మర్యాదలేంటి ఏంటి..?

ఓ కస్టమర్‌ కింగ్స్‌ అండ్ క్వీన్స్‌ పబ్‌లోకి వెళ్లాడు. కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపించింది. మసక మసక చీకటి పాటలు, డ్యాన్సులు చూసి ఆనందంతో పొంగిపోయాడు. ఇంతలోనే ఏ బ్రాండ్‌ అంటూ అమ్మాయి కస్టమర్‌ను అడిగింది. అతడు లిక్కర్‌ తాగే అలవాటు లేదని తెలిపాడు. ఇంతలోనే ఆ అమ్మాయి ఆ కస్టమర్‌కు కోక్‌ ఆర్డర్ చేసి.. తనకు మాత్రం విలువైన స్కాచ్‌ ఆర్డర్ ఇచ్చింది. కస్టమర్‌ కూల్‌డ్రింక్‌ తాగేలోపే ఆమె పెగ్గుల మీద పెగ్గులు తాగేసింది. అతడు షాక్‌ అయ్యేలా పది పెగ్గులు లాగేసింది. వీటికి తోడు వోడ్కా షాట్స్ ఆర్డర్ చేసింది. మధ్యలో స్టఫ్ బాగా లాగించేసింది. కస్టమర్‌ను మాటల్లో పెట్టిన అమ్మాయి ఏకంగా 20 వోడ్కా షాట్స్ తాగేసింది. ఆ అమ్మాయి కవ్వించే మాటలకు ఆ కస్టమర్‌కు మందు తాగిన దాని కంటే ఎక్కువ మత్తు ఎక్కింది. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆ అమ్మాయి వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని వెళ్లింది. గంట దాటినా ఆ అమ్మాయి రాలేదు. ఫోన్‌ చేస్తే మొబైల్ స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. వెయిటర్‌ మాత్రం బిల్లును తీసుకొచ్చాడు. బిల్లు చూస్తే కస్టమర్ గుండె ఆగినంత పని అయింది. బిల్లు ఏకంగా 40 వేలు దాటేసింది. ఇంత బిల్లు ఎందుకు అయిందని అడిగితే.. ఒక్కో పెగ్గుకు ఎంత కాస్ట్ వేశామో చూసుకోవాలని చెప్పాడు వెయిటర్. అంతలోనే బిల్లు కడతావా లేదా అంటూ బౌన్సర్స్ కస్టమర్ మీదకు వచ్చారు. దీంతో చేసేదేమీ లేక బిల్లు కట్టి వెళ్లాడు. అంత తాగినా ఆ అమ్మాయి నడక మారకుండా, తూలకుండా ఎలా వెళ్లిందని ఆ కస్టమర్‌కు అనుమానం వచ్చింది. ఇప్పుడే ఆ ట్విస్ట్ ఏంటో బయటపడింది. ఆ అమ్మాయి ఏం ఆర్డర్‌ చేసినా పబ్ సిబ్బంది తెచ్చింది మాత్రం కూల్‌ డ్రింక్సే. అవి వోడ్కా షాట్స్ కాదు.. స్ప్రైట్ కూల్ డ్రింక్. 20 రూపాయల కూల్‌డ్రింక్‌ సర్వ్‌ చేసి వేలకు వేలు డబ్బులు కొట్టేశారు. కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ యాజమాన్యం ఆడిన గేమ్‌లో బలైనట్లు కస్టమర్ గ్రహించాడు.

Read Also: Mumbai: 30 మందితో వెళ్తున్న ఫెర్రీ బోల్తా.. కొనసాగుతున్న రెస్క్యూ..

టిండర్ యాప్‌లో ఉండే యువకులు, వ్యాపారులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రొఫైల్ చూసి ఎవరైతే చాటింగ్ చేస్తారో వారినే లక్ష్యంగా చేసుకుంటారు. అమ్మాయి పేరుతో యువకులే చాటింగ్ చేస్తారు. లైన్‌లో పడ్డాడని తెలిశాక కలుద్దామా అంటూ ఊరిస్తారు. ఓకే అంటే అమ్మాయిని రంగంలోకి దించుతారు. పబ్లిక్‌ ప్లేస్‌కు లేదంటే కేఫ్‌కు రమ్మని పిలుస్తారు. అక్కడ అమ్మాయితో మాటల్లో పెట్టించి పబ్‌కు వచ్చేలా చేస్తారు. పబ్‌లో కూడా ముఠా సభ్యులు ఉంటారు. వెయిటర్స్ కూడా ఆ ముఠా వాళ్లే. వలలో పడిన వారికి రెగ్యులర్ మెనూ కాకుండా.. ఎక్కువ ధరలు ఉండే స్పెషల్ మెనూ ఇస్తారు. ఆ మెనూను కూడా సెపరేట్ పేరుతో పిలుస్తారు. ఆ మెనూలో ధరలు డబుల్ కంటే ఎక్కువగానే ఉంటాయి. అక్కడే అందమైన అమ్మాయి ఉండడంతో డబ్బు ఖర్చు చేసేందుకు కొందరు వెనకాడరు. ఆ అమ్మాయి వచ్చినదంతా తాగేసి ఏదో వంక చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది. దాంతో ఆ యువకుడు బాధితుడిగా మారి వేలల్లో బిల్లు కట్టాల్సి ఉంటుంది. ఇలా వలలో పడిన బాధితుల నుంచి రూ.40 వేల నుంచి 80 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇవన్నీ స్థానిక పోలీసులకు తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఎక్సైజ్, ఎస్వోటీ, స్థానిక పోలీసులకు ఎవరి వాటాలు వారికి వస్తుండడంతో కింగ్స్‌ అండ్ క్వీన్స్ మోసాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. గతంలో మాదాపూర్‌లోని మోష్ పబ్‌ కూడా ఇలా మోసాలకు పాల్పడింది. ఇలా ఒకరిద్దరు కాదు వందలాది మంది బాధితులు ఉన్నారు.

 

Show comments