Petrol and Diesel Prices Hiked Again in Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఐదు రోజుల్లోనే ఇది రెండోసారి పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే గత శుక్రవారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.14, డీజిల్‌పై రూ.3.11 పెరగగా.. తాజాగా మరోసారి ధరలను పెరిగాయి. ఈసారి పెట్రోల్, డీజిల్‌పై అదనంగా 90 పైసలు చొప్పున పెరిగింది.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.110.88కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.98.99కు పెరిగింది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజూ వాహనాలు ఉపయోగించే ఉద్యోగులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లపై ఈ భారం తీవ్రంగా పడుతోంది.
ఇక వరంగల్ జిల్లాలో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు డీజిల్ ధర రూ.98.44 ఉండగా.. ఈరోజు అది రూ.99.44కు చేరింది. అలాగే పెట్రోల్ ధర నిన్న రూ.110.32 ఉండగా.. నేడు రూ.111.30కు పెరిగింది. ఒక్కరోజులోనే దాదాపు రూపాయి పెరగడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మార్పులు, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే వరుస పెరుగుదలలతో సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సమయంలో ఇంధన ధరల పెంపు మరో దెబ్బగా మారిందని ప్రజలు అంటున్నారు.
