Hyderabad: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పోలీసులు పదేపదే హెచ్చరికలు చేసినప్పటికీ మందుబాబులు మాత్రం లెక్కచేయకపోవడంతో భారీ సంఖ్యలో పట్టుబడ్డారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2731 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. పట్టుబడిన వారందరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కారు. నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు కొనసాగిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టమైంది. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
READ MORE: Antarvedi Beach: న్యూ ఇయర్ వేళ అత్యుత్సాహం.. జీప్తో సహా గల్లంతైన యువకుడు..!
ఇదిలా ఉండగా.. న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా, శాంతియుతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న(బుధవారం) ఎన్టీవీతో సీపీ మాట్లాడుతూ.. మందు బాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే డ్రంక్ డ్రైవింగ్‌పై సజ్జనార్ కఠినంగా స్పందించారు. “తాగి డ్రైవ్ చేస్తే తప్పకుండా పట్టుబడతారు. ఇక్కడ షార్ట్‌కట్స్ లేవు, చాకచక్యాలు పనిచేయవు” అని హెచ్చరించారు. కొద్దిగా మద్యం తాగిన తర్వాత పోలీసులను మోసం చేయగలమని అనుకుంటే అది పెద్ద పొరపాటేనని స్పష్టం చేశారు. హైదరాబాద్ పోలీసులు చేపట్టిన వ్యూహాత్మక డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చక్రవ్యూహం లాంటివని, అందులో పడితే తప్పించుకునే మార్గమే లేదన్నారు. అయినప్పటికీ సీపీ వార్నింగ్‌ను భేఖతరు చేశారు మందుబాబులు..