Hyderabad: వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయంటే చాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లో పండుగ శోభ సంతరించుకుంటుంది. వీధివీధినా గణనాథులు కొలువుదీరి ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ అన్నదానాలు ఆకలి బాధలను తీరుస్తాయి. ముఖ్యంగా గదుల్లో వంట చేసుకోవడానికి ఇబ్బంది పడే బ్యాచిలర్లకు, హాస్టల్ విద్యార్థులకు, చాలిచాలని జీతాలతో పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రసాద వితరణ ఎంతో మేలు చేస్తుంది. అయితే, విశాలమైన భాగ్యనగరంలో ఏ రోజు, ఏ సమయంలో, ఏ ఏరియాలో అన్నదానం జరుగుతుందో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
ఈ సమస్య పరిష్కారానికి టెక్నాలజీ ఆధారంగా ‘Annadhanam Spots’ (annadhanamspots.in) అనే సరికొత్త ఉచిత వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు ముఖ్యంగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, దిల్‍సుఖ్‍నగర్, కూకట్‌పల్లి, మాదాపూర్, ఎల్‌బీనగర్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లోని అన్నదాన కేంద్రాల వివరాలను ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అన్నదానం ప్రారంభమయ్యే కచ్చితమైన సమయం (మధ్యాహ్నం లేదా రాత్రి), నేరుగా చేరుకోవడానికి గూగుల్ మ్యాప్స్ లింక్, ఆ రోజు వడ్డించే ప్రసాదం (పులిహోర, దద్దోజనం, వెజ్ బిర్యానీ, పాయసం వంటివి) మెనూ వివరాలు కూడా లభిస్తాయి. క్రౌడ్ సోర్సింగ్ విధానంలో నడిచే ఈ పోర్టల్‌లో ఎలాంటి సైన్అప్ లేదా లాగిన్ లేకుండానే వినియోగదారులు స్వయంగా తమకు తెలిసిన అన్నదాన వివరాలను నమోదు చేయవచ్చు. ఆకలితో ఉన్నవారికి సకాలంలో భోజనం దొరికేలా అన్నదాతలను, భక్తులను ఒకే వేదికపైకి తెచ్చిన ఈ ఆలోచనపై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు, నగరంలో ఫేమస్ అయిన ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షంలోనూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి బడా గణేష్‌ను దర్శించుకోగా, ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు, నిర్వాహకులు క్యూలైన్లు, మండప పరిసరాల్లో తగిన ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలు, అన్నదానాలు, నిమజ్జన వేడుకలతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక అలరారుతోంది.

