Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు

Hyd

Hyd

Hyderabad Food Safety: హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (TG SAFE – Telangana Standards Authority for Food and Essential Drugs) అధికారులు విస్తృత స్థాయి ఆకస్మిక దాడులు నిర్వహించారు. నాణ్యత, పరిశుభ్రత నిబంధనలు పాటించకుండా వినియోగదారులకు కల్తీ, నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదులతో 10 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో 11 ప్రముఖ రెస్టారెంట్ల FSSAI లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.

లైసెన్సులు రద్దయిన హోటళ్లు, రెస్టారెంట్లు:
మొనాస్టరీ (హైటెక్ సిటీ)
శివానీ రెస్టారెంట్ అండ్ బార్ (గచ్చిబౌలి)
అల్ సబా రెస్టారెంట్ (గచ్చిబౌలి)
లక్కీ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ & సాయిరామ్ మెస్ (మాదాపూర్)
ఉడుపిస్ ఉపహార్ (గచ్చిబౌలి)
కోల్ స్పార్క్
కాంచీ కేఫ్ (హైటెక్ సిటీ)
ఆంతెరా కిచెన్ అండ్ బార్ (గచ్చిబౌలి)
అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్
ఫ్యూజన్ 9 / అమ్నేషియా స్కై బార్ (ఇనార్బిట్ మాల్, మాదాపూర్)

అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ’63 డిగ్రీస్ మోడర్న్ రీజినల్ బఫెట్’ (గచ్చిబౌలి), మినర్వా గ్రాండ్ (కొండాపూర్), హోటల్ అవాసా (హైటెక్ సిటీ) హోటళ్లకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ తనిఖీల సమయంలో పలు హోటళ్ల వంటశాలల్లో బొద్దింకలు, ఎలుకల సంచారం ఉండటం, బూజు పట్టిన కూరగాయలు ఉపయోగించడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం లాంటి విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పక్వాన్ గ్రాండ్‌లో ఏకంగా 1,170 కేజీల గడువు తీరిన బియ్యాన్ని అధికారులు గుర్తించారు. దీనికి తోడు వంట చేసే సిబ్బంది ఏమాత్రం వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడాన్ని తప్పుపట్టారు. దాడుల సందర్భంగా మొత్తం 21 ఆహార నమూనాలను సేకరించిన అధికారులు, వాటిని సమగ్ర విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపించారు.