NTV Telugu Site icon

Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Hyderabad Book Fair 2024

Hyderabad Book Fair 2024

నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్‌) ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్‌ కొనసాగనుంది. 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్‌ అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని చెప్పారు.

బుధవారం ఎన్‌టీఆర్‌ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్‌ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు డా.యాకూబ్‌ షేక్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బుక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ 11 రోజుల పాటు కొనసాగుతుంది. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్‌ను చూడవచ్చు. ఈ ఏడాది తొలిసారిగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయనున్నారు.

Also Read: R Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్‌ రిటైర్‌మెంట్‌కు ఆ ఇద్దరే కారణమా?

బుక్‌ ఫెయిర్‌ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి మరియు ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయ భారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశారు. బుక్ ఫెయిర్ సందర్భంగా తెలంగాణ రుచులతో ఫుడ్‌ స్టాళ్లు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సహా వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందిస్తున్నామని హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.

Show comments