Hyderabad National Book Fair 2024: ప్రతి ఏడాది హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన (నేషనల్ బుక్ ఫెయిర్) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ జాతీయ పుస్తక ప్రదర్శన.. 36వ ఎడిషన్‌తో ఈ ఏడాది కూడా మన ముందుకొచ్చింది. ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు పది రోజుల పాటు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుంది. ఈ ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి, పర్యాటక, అబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ జరగనున్నట్లు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ వేదికకు సంస్కృత పండితులు రవ్వా శ్రీహరి పేరు, ద్వారానికి ఉర్దూ దినపత్రిక సియాసత్ మాజీ ఎండీ జహీరుద్దీన్ అలీ ఖాన్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మొత్తం 365 స్టాళ్లలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని గౌరీ శంకర్ చెప్పుకొచ్చారు.
Also Read: Israel Air Strike : దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. ఐదుగురు చిన్నారులు సహా 13 మంది మృతి
జాతీయ పుస్తక ప్రదర్శన ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుంది. ఈ బుక్ ఫెయిర్‌లో 365 స్టాల్స్ ఏర్పాటు చేశారు. పుస్తక ప్రదర్శనలో సాధారణ, ఇంగ్లీషుకు సంబంధించి 214.. తెలుగు భాషకు సంబంధించి 115.. స్టేషనరీ, హిందీ, ప్రభుత్వ, మీడియా స్టాల్స్ 36.. రచయితలకు 6 స్టాల్స్ కేటాయించారు. జాతీయ స్థాయిలో చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేశారు.