Hyderabad: హైదరాబాద్ నగరంలో కలుషిత ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరోసారి కఠిన చర్యలు తీసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెదాన్ పారిశ్రామిక ప్రాంతంలో నాసిరకం అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న కేంద్రంపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (ఖైరతాబాద్ జోన్) మరియు హెచ్-ఫాస్ట్ బృందం సంయుక్తంగా ఆకస్మిక దాడి నిర్వహించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో పోలీసులు కట్టెదాన్ ఐడీఏలోని ‘SKR ఫుడ్ ప్రొడక్ట్స్’ (ప్లాట్ నెం.25, SEIE) పై దాడి చేశారు. ఈ సందర్భంగా హసన్ అలీ రూపానీ (55) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అబిడ్స్ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. తనిఖీల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రంలో తీవ్ర అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూశాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో, పరిశుభ్రతకు విరుద్ధంగా పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తొక్కలను ఉపయోగించి పేస్ట్ తయారు చేస్తున్నట్లు వెల్లడైంది.
READ MORE: UP: దోమల కోసం అగరబత్తులు వెలిగింపు.. 4 సిలిండర్లు పేలి.. సోదరులకు తీవ్రగాయాలు
పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. తయారు చేసిన పేస్ట్‌ను బహిరంగ ప్రదేశాల్లో నిల్వ చేయడంతో దుమ్ము, ఈగలు వాలినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేస్ట్‌ను హోల్‌సేల్ కిరాణా దుకాణాలు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో నిందితుడు చెలగాటం ఆడుతున్నాడని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే లాభాపేక్షతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడిలో సుమారు రూ.22 లక్షల విలువైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4,032 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, 6,000 కిలోల నాసిరకం వెల్లుల్లి, 210 కిలోల నాసిరకం అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులు, 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితుడిని, స్వాధీనం చేసిన సామగ్రిని తదుపరి విచారణ కోసం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
