NTV Telugu Site icon

Allahabad High Court: కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే..

Allahabad High Court

Allahabad High Court

Allahabad High Court: ఉద్యోగం, ఆదాయం లేనందున తన భార్యకు భరణం చెల్లించలేనని భర్త చెప్పడం తగదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగం లేకపోయినా కూలి పనిచేసైనా విడాకులు తీసుకున్న భార్యకు భరణం చెల్లించాల్సిందేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కూలి పనులు చేసైనా రోజుకు రూ.300 లేదా రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాలని భర్తను కోర్టు ఆదేశించింది. విడిపోయిన భార్యకు నెలకు రూ.2,000 భరణంగా చెల్లించాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ఓ వ్యక్తి దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు లక్నో బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్‌ రేణు అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తీర్పు ఇచ్చినప్పటి నుంచి భార్యకు చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జస్టిస్ రేణు అగర్వాల్ ట్రయల్ కోర్టు న్యాయమూర్తిని ఆదేశించారు.

Read Also: Rajyasabha: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

యూపీకి చెందిన ఓ జంట 2015లో వివాహం చేసుకుంది. అయితే వరకట్నం కోసం భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2016లో పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులకు ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేస్తూ.. భార్యకు మనోవర్తి కింద నెలకు రూ.2వేలు చెల్లించాలని ఆదేశించింది. ఇలా నెలవారీ భరణం చెల్లించాలని కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ వ్యక్తి ఫిబ్రవరి 21, 2023లో హైకోర్టును ఆశ్రయించాడు.

Read Also: Murder Mystery Case: విజయనగరంలో వృద్దురాలి హత్య కేసులో వీడిన మిస్టరీ

తన భార్య గ్రాడ్యుయేట్‌ అని, ఉపాధ్యాయురాలిగా నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని ప్రిన్సిపల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదని హైకోర్టులో పేర్కొన్నాడు. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, వైద్యుడి వద్ద చికిత్స పొందుతున్నానని, తాను కూలీ పనులు చేసుకుంటూ అద్దె గదిలో ఉంటున్నానని, తన తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు తన పైనే ఆధారపడి ఉన్నారని చెప్పాడు. అయితే, భార్య ఉద్యోగం చేసి నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందనే విషయాన్ని రుజువు చేయలేకపోయాడు. భార్య ఉపాధ్యాయ వృత్తిలో రూ.10వేలు సంపాదిస్తున్నట్లు భర్త ఎలాంటి పత్రాన్ని సమర్పించలేరని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఉద్యోగం లేకపోయినప్పటికీ కూలీగా రోజుకు కనీసం రూ.300 నుండి రూ.400 సంపాదించైనా భరణం చెల్లించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ ఆరోగ్యవంతుడని, డబ్బు సంపాదించగల సమర్థుడని, అతని భార్య పోషణ బాధ్యత కూడా ఆయనదేనని కోర్టు పేర్కొంది.

Show comments