NTV Telugu Site icon

Iran: ఇరాన్‌లో మరో ఘాతుకం.. విద్యకు దూరం చేసేందుకు విద్యార్థినులపై విషప్రయోగం

Iran

Iran

Iran: కొన్ని నెలల క్రితం ఇరాన్‌ జరిగిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలికలను చదువుకు దూరం చేసేందుకు చేసిన ప్రయత్నాల గురించి ఇరాన్‌ మంత్రి ఒకరు వెల్లడించారు. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను మరువకముందే ఇరాన్‌ను మరో విషయం కుదిపేస్తోంది. బాలికలను విద్యకు దూరం చేసేందుకు వారి ప్రాణాలను బలితీసుకునే కుట్రలు జరిగాయని, వారిపై విషప్రయోగం చేసినట్లు ఇరాన్ మంత్రి ఒకరు పేర్కొన్నారు. ఇరాన్‌లో వందలాది మంది విద్యార్థినులపై విషప్రయోగం జరిగింది. ఆ దేశంలో మహిళలపై జరుగుతున్న హింసాకాండను మరువక ముందే మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. బాలికల విద్యను ఆపేయాలన్న ఉద్దేశంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ మేరకు డిప్యూటీ ఆరోగ్య శాఖ మంత్రి యూనెస్‌ పనాహి ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లు తెలిపారు.

గతేడాది నవంబర్‌ నుంచి కోమ్‌, దక్షిణ టెహ్రాన్‌లో వందలాది విద్యార్థినులకు శ్వాసకోశం విషపూరితమైనట్లు వైద్యులు గుర్తించారు. దీనిపై తాజాగా ఇరాన్‌ మంత్రి యునెస్‌ పనాహి స్పందించారు. ఈ విష ప్రయోగం కావాలనే జరిగినట్లు మంత్రి వెల్లడించారు. ఇదంతా బాలికల పాఠశాలలను మూసివేసి.. వారిని విద్యకు దూరం చేసేందుకేనని ఆయన వెల్లడించారు. ఈ దారుణం వెనుక ఎవరున్నారు అనే విషయాలను మాత్రం పేర్కొనలేదు. అలాగే ఇంతవరకు ఎలాంటి అరెస్టు చోటుచేసుకోకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఈ విషయమై అధికారులను నిలదీసేందుకు నగర గవర్నరేట్‌ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతేగాదు విద్యార్థినులపై విష ప్రయోగం జరిగిన వెంటనే కొంతమంది అన్ని పాఠశాలలను ముఖ్యంగా బాలికల పాఠశాలలను మూసివేయాలని కోరినట్లు ఇరాన్‌ స్థానిక మీడియాలు కూడా పేర్కొన్నాయి.

Read Also: Halari Donkey: గర్భం దాల్చిన గాడిదలకు సీమంతం.. గొప్ప కారణమే ఉందండోయ్ !

ఈ విషప్రయోగ ఘటనపై ఫిబ్రవరి 14న బాధితుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడంతో.. దీనికి గల కారణాలను గుర్తిస్తున్నామని అక్కడి సర్కారు స్పందించింది. ప్రభుత్వ ప్రతినిధి అలీ బహదోరి జహ్రోమి మాత్రం ఇంటెలిజెన్స్, విద్యా మంత్రిత్వ శాఖలు ఈ ఘటనకు గల కారణాలను కనుగొనడానికి యత్నిస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాదు ఈ ఘటనకు కారణాలపై సత్వరమే దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులును అదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Show comments