Site icon NTV Telugu

TS 6 Guarantees: ప్రజాపాలనకు భారీ స్పందన.. తొలిరోజే 7.46 లక్షల దరఖాస్తులు

6 Garenti Revanth Reddy

6 Garenti Revanth Reddy

TS 6 Guarantees: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు హామీల అమలు దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆరు హామీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రజా పరిపాలన కార్యక్రమానికి తొలిరోజు భారీ స్పందన వచ్చింది. ఉదయం నుంచే ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలిరోజు 7.46 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ‘అభయహస్తం’ కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ల వంటి ఆరు హామీ పథకాలకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటన్నింటికీ రేషన్ కార్డులు జత చేయాలని అధికారులు సూచించారు. అయితే రేషన్ కార్డులు లేని వారు తెల్లకాగితాలపై అర్జీలు ఇవ్వాలని అధికారులు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో జీహెచ్‌ఎంసీతోపాటు గ్రామాల్లో 2,88,711, పట్టణ ప్రాంతాల్లో 4,57,703 ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

Read also: Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు!

నిన్న (గురువారం) ప్రారంభమైన ఈ ప్రజాపరిపాలన కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగనుంది. దరఖాస్తుదారులలో ఎక్కువ మంది మహిళలు. చాలామంది తమ భార్యల పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలు, వార్డులు, డివిజన్ల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తొలిరోజు జరిగిన సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ 6 హామీలకు సంబంధించిన ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. చాలా మంది ఇంటి వద్ద వాటిని నింపి గ్రామ, వార్డు, డివిజన్ సమావేశాల్లో ప్రదర్శించారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని 141 మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపల్‌ కార్పొరేషన్లలోని 2,258 కేంద్రాల్లో ‘ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాపరిపాలన కార్యక్రమాన్ని సమీక్షించారు. ప్రతి కేంద్రంలో తగిన దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలన్నారు.
Canada : కెనడాలోని హిందూ దేవాలయాలపై దాడి.. హుండీల దొంగ దొరికేశాడు

Exit mobile version