NTV Telugu Site icon

Vistara: రెండేళ్ల చిన్నారికి విమానంలో ఆగిన శ్వాస.. పునర్జన్మ ఇచ్చిన ఎయిమ్స్ వైద్యులు

Aiims

Aiims

How AIIMS Doctors Saved 2-Year-Old After She Stopped Breathing Mid-Air: విమానంలో శ్వాస ఆగిపోయిన రెండేళ్ల చిన్నారి ఓ వైద్య బృందం రక్షించింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విస్తారా విమానంలో రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోగా.. విమానంలో ఉన్న వైద్యులు వచ్చి పాపకు చికిత్స చేయాలని సిబ్బంది అత్యవసర ప్రకటన చేశారు. అదృష్టం కొద్దీ అదే విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)కి చెందిన ఐదుగురు వైద్యులు చిన్నారికి అత్యవసర చికిత్స అందించారు. సమయానికి స్పందించి పసిబిడ్డ ప్రాణాలను కాపాడారు. ఆదివారం బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్న విస్తారా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనను ఢిల్లీ ఎయిమ్స్ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని ఎయిమ్స్ సిబ్బంది ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ విమానంలో ఉన్న చిన్నారి చిత్రాలను పంచుకుంది.

Read Also: Blue Supermoon: ఆకాశంలో అద్భుతం.. “బ్లూ సూపర్‌మూన్”గా చంద్రుడు .. ఇప్పుడు చూడకుంటే 2037 వరకు ఆగాల్సిందే..

అసలేం జరిగిందంటే.. గుండె సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స కోసం బెంగళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికి చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. అంతేకాకుండా పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారాయి. చిన్నారి నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పుర్‌ వైపు మళ్లించారు. ఇండియన్ సొసైటీ ఫర్ వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ఒక వైద్య బృందం చిన్నారి పరిస్థితిని తెలుసుకొంది. వెంటనే పాపను కాపాడేందుకు వారు ముందుకు వచ్చారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లించినప్పటికీ చిన్నారిని రక్షించేందుకు వైద్యుల బృందం 45 నిమిషాల పాటు శ్రమిస్తూనే ఉంది.

పాప కార్డియాక్‌ అరెస్ట్‌కు గురికాగా.. వైద్యులు ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ని ఉపయోగించారు. ఇది సాధారణంగా ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌ను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి ఉపయోగించే పరికరం. దాదాపు 45 నిమిషాల పాటు, శిశువుకు చికిత్స అందించారు. తీవ్రంగా శ్రమించి ప్రథమ చికిత్స ద్వారా చిన్నారి ప్రాణాలను కాపాడారు. ఎట్టకేలకు నాగ్‌పూర్‌కు తరలించి అక్కడి పిల్లల వైద్యులకు చూపించారు. రెండేళ్ల చిన్నారికి వైద్యులు పునర్జన్మ అందించారు. విమానంలో జరిగిన ఘటనతో పాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.