Amit Shah Manipur visit: దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లుతున్న మణిపూర్‌లో శాంతి వాతావరణం నెలకొల్పడానికి స్వయంగా కేంద్ర హోం మంత్రే రంగంలోకి దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు సాయంత్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు చేరుకోనున్నారు. నాలుగు రోజులపాటు అక్కడే ఉండి.. రెండు వర్గాలతో శాంతి చర్చలు జరపనున్నారు. జూన్ 1 వరకు నాలుగు రోజులపాటు హోం మంత్రి మణిపూర్‌లోనే ఉండనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే రెండు రోజుల క్రితం శాంతిభద్రతలపై సమీక్ష చేశారు. పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సమయంలో తిరిగి ఆదివారం పలు ఎన్‌కౌంటర్లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్మీ చీఫ్ ఉండి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహిస్తున్నప్పటికీ .. ఇంఫాల్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడ లేదు.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఇంఫాల్ చేరుకోనున్నారు. మెయిటీలు, కుకీ రెండు వర్గాల వారు సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శాంతి. సహనాలతో ఉండాలని కేంద్ర హోం మంత్రి అభ్యర్థించనున్నారు. రెండు వర్గాలతోనూ కేంద్ర హోం మంత్రి ప్రత్యేకంగా చర్చించనున్నారు. రెండు వర్గాలతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి శాంతియుత వాతావరణం నెలకొల్పాలనే ప్రధాన ఉద్దేశంతోనే అమిత్ షా ఇంఫాల్ పర్యటన చేపట్టనున్నట్టు తెలుస్తోంది. మెయిటీ– కుకీ తెగల మధ్య ఘర్షణలతో మణిపూర్‌లో మే 3వ తేదీ నుంచి అశాంతి నెలకొంది. అప్పటినుంచి మణిపూర్‌లో ఇంటర్నెట్ బంద్ చేశారు. 34 వేల మంది కేంద్ర భద్రతా దళాలను రాష్ట్రంలో మోహరించారు. వాస్తవానికి మణిపూర్‌కు చెందిన 25పైగా కుకీ తిరుగుబాటు వర్గాలతో కేంద్ర ప్రభుత్వం–రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కిందట త్రైపాక్షిక శాంతి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం తిరుగుబాటుదారులు ప్రభుత్వం నిర్దేశించిన శిబిరాలకు పరిమితం కావాలి. ఆయుధాలను పక్కనపెట్టాలి. కానీ, మెయిటీలు ఎస్టీ హోదా డిమాండ్ చేస్తుండడం.. గువాహటి హైకోర్టు దానికి మద్దతుగా తీర్పు ఇవ్వడంతో.. కుకీలు మళ్లీ ఆయుధాలు చేతబట్టడంతో ఘర్షణలు మొదలయ్యాయి.
