USA Independence Day 2023: బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది. బ్రిటన్ ప్రపంచంలోని దాదాపు 80 దేశాలు, దీవులను పాలించింది. బ్రిటీష్ సామ్రాజ్యం ప్రపంచ భూభాగంలో దాదాపు 26 శాతంగా ఉంది. ఇందులో అమెరికా దేశం కూడా ఉంది. అవును, ప్రపంచంలోనే అత్యధిక ఆయుధాలు కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన దేశం కూడా బ్రిటిష్ వారికి బానిసగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జూలై 4, 1776 న, అమెరికా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం ప్రకటించింది. దీనితో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్థాపించబడింది. ఈసారి అమెరికా 247వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కొలంబస్ పొరపాటున అమెరికా చేరినప్పుడు..
క్రిస్టోఫర్ కొలంబస్ భారతదేశానికి రావడానికి యూరప్ నుండి బయలుదేరినప్పుడు, అతను అనుకోకుండా అమెరికాకు చేరుకున్నాడని నమ్ముతారు. కొలంబస్ తన ప్రజలకు అమెరికా గురించి చెప్పినప్పుడు ఆ దేశం స్వాధీనం కోసం చాలా దేశాల మధ్య పోరాటం జరిగింది. అయితే బ్రిటిష్ ప్రజలు అత్యధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని అమెరికాను స్వాధీనం చేసుకున్నారు. భారతదేశం వలె, బ్రిటిష్ వారు అమెరికా ప్రజలను హింసించారు. దీంతో బ్రిటిష్ అధికారులకు, అమెరికన్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వాస్తవానికి అమెరికాకు 1776 జులై 2నే స్వతంత్రం వచ్చింది. కానీ అందుకు కారణాలను వివరిస్తూ కాంటినెంటల్ కాంగ్రెస్.. బ్రిటన్ కింగ్ జార్జ్‌కు లేఖ రాసింది. ఆయన ఆమోదంతో జులై 4న అధికారికంగా స్వాతంత్య్ర ప్రకటన చేశారు. కానీ అమెరికా రాష్ట్రాల సంతకాలు, ఇతర ప్రక్రియలు ఆగస్టు 2 వరకు సాగాయి. శ్వేతసౌధంలో ఈ వేడుకలు తొలిసారిగా 1801లో జరిగాయి. అప్పటి దేశాధ్యక్షుడు థామస్ జఫర్సన్ ఈ వేడుకలను నిర్వహించారు. థామస్ జఫర్సన్ అమెరికా స్వాతంత్య్రం ప్రకటిస్తున్నట్లు తెలిపే ప్రకటనను రూపొందించారు. ఆయనే అమెరికా మూడో అధ్యక్షుడిగా వ్యవహరించి.. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే 1826లో జులై 4న మృతి చెందారు. అమెరికా 2వ అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఆడమ్స్ (1826 జులై 4 ), 5వ అధ్యక్షుడిగా వ్యవహరించిన జేమ్స్ మొన్రే (1831 జులై 4) కూడా అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజునే మరణించారు. అమెరికా జాతీయ పతాకంలో స్టార్స్ ఇప్పుడు ఉన్న క్రమంలో ఉండేవి కావు. 1776నాటి పతాకంలోని స్టార్స్ వలయాకారంలో ఉండేవి. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు సమానమే అని చాటి చెప్పేందుకు అలా డిజైన్ చేశారట.
చరిత్ర
ఏప్రిల్ 1775లో విప్లవ యుద్ధం మొదలైంది. న్యూ ఇంగ్లాండ్‌లోని ప్రజలు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడటం ప్రారంభించారు. బ్రిటీష్ వారు వారిని రాడికల్స్‌గా పరిగణించారు. జూన్ 7న, కాంటినెంటల్ కాంగ్రెస్ ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా స్టేట్ హౌస్‌లో సమావేశమైంది. వర్జీనియా ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ స్వాతంత్ర్యం కోసం పిలుపునిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జూలై 2న, గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ రహస్యంగా ఓటు వేసింది. జూలై 4, 1776న స్వాతంత్ర్య ప్రకటన ఆమోదించబడింది. ఆగష్టు 2, 1776న, ప్రతినిధులు స్వాతంత్య్ర ప్రకటనపై సంతకం చేయడం ప్రారంభించారు. 1870లో, స్వాతంత్య్ర దినోత్సవం సమాఖ్య ఉద్యోగులకు వేతనం లేని సెలవు, కానీ 1941లో దీనిని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు.
ఇలా తొలి వేడుకను జరుపుకున్నారు..
జూలై 4, 1977న, పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో మొదటిసారిగా దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ తొలి వేడుకలో 13 తుపాకీ కాల్పులు జరిగాయి, బాణసంచా కాల్చడం కూడా ఈ రోజు నుంచే మొదలైంది. 1801లో వైట్ హౌస్ అధికారికంగా జూలై 4ను స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించింది. అమెరికా స్వాతంత్ర్యం కోసం పోరాడిన జనరల్ జార్జ్ వాషింగ్టన్ అమెరికాకు మొదటి అధ్యక్షుడయ్యారు. దీంతో అమెరికా రాజధానికి వాషింగ్టన్ డీసీ అని పేరు పెట్టారు.