Himachal Pradesh Congress Chief: హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్‌లో ఓటేసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ మాట్లాడారు. తన పార్టీ 40-45 సీట్లు గెలుస్తుందని, ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ అభివృద్ధి కోసం పని చేస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ శనివారం సిమ్లాలోని రాంపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు.
సిమ్లా రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విక్రమాదిత్యకు కాంగ్రెస్ మరోసారి బాధ్యతలు అప్పగించింది. ఆ స్థానంలో బీజేపీకి చెందిన రవి మెహతా, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రేమ్ ఠాకూర్ బరిలో నిలిచారు. సిమ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, ఆప్, కాంగ్రెస్, సీపీఎంల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. హిమాచల్ ప్రదేశ్‌లో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ప్రతిభా సింగ్ అన్నారు. తన భర్త, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మరణం తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహించేందుకు ఆమె ఎన్నికయ్యారు.
Gujarat Assembly Elections: స్పీడ్ పెంచిన బీజేపీ.. అభ్యర్థుల రెండో జాబితా విడుదల
అయితే తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చాలా మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ హైకమాండ్, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని ఆమె అన్నారు. గత ఏడాది మరణించిన వీరభద్ర సింగ్ లేకపోవడంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రతిభా సింగ్ చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పార్టీ నిరంతరం కృషి చేస్తుందని, అందుకే కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుందని ఆమె అన్నారు.