NTV Telugu Site icon

Mohanlal-AMMA: ఆఫీస్ బాయ్‌గా కూడా చేయను.. సూపర్ స్టార్ కీలక వ్యాఖ్యలు!

Mohanlal Amma

Mohanlal Amma

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాలీవుడ్ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక పేర్కొంది. రిపోర్ట్‌ అనంతరం పలువురు నటీమణులు తమ చేదు అనుభవాలను పంచుకున్నారు. ఓవైపు తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ప్రముఖ నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌.. అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

ఇక మోహన్‌ లాల్‌ మరోసారి అమ్మ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆయన స్పందించారు. అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అమ్మ ఆఫీస్‌ బాయ్‌గా కూడా చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్‌ లాల్‌ చెప్పారు.

Also Read: Game Changer Poster: ‘గేమ్​ ఛేంజర్’ నయా పోస్టర్.. కియారా లుక్ కిరాక్ అంతే!

‘అమ్మ అధ్యక్షుడిగా నేను మరోసారి ప్రమాణం చేస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అమ్మ ఆఫీస్‌ బాయ్‌గా కూడా చేయడం నాకు ఇష్టం లేదు. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెలుగులోకి వచ్చిన విషయాలతో దిగ్భ్రాంతికి గురయ్యా. మేం మూకుమ్మడిగా పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని చెప్పమని అందరూ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమదే. హేమ కమిటీ రిపోర్ట్‌ ఎన్నో సమస్యలను బయటపెట్టింది. ఎన్నో విషయాలు బహిర్గతమైన తర్వాత ప్రతిఒక్కరూ అమ్మనే ప్రశ్నించారు’ అని మోహన్‌ లాల్‌ అన్నారు. ప్రస్తుతం అమ్మకు తాత్కాలిక పాలకమండలి ఉంది. త్వరలో అమ్మ కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంటామని మాజీ ఉపాధ్యక్షుడు జయన్ చేర్యాల, సురేష్ గోపి సూచనప్రాయంగా తెలిపారు. జూన్‌లో అమ్మ జనరల్ బాడీ, ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.