NTV Telugu Site icon

Srisailam Traffic Jam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్

Srisailam Traffic

Srisailam Traffic

మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. రాత్రంతా జాగరణ ఉన్న భక్తులు ఉదయం శివుడిని దర్శించుకున్నారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి ముఖద్వారం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై కార్లలో బస్సులలో సొంత వాహనాలలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శ్రీశైలం నుంచి ఎటు చూసినా రోడ్లపై కార్లు బస్సులు ఆటోలు జీపులు అడ్డదిడ్డంగా నిలిపివేశారు. దీంతో శ్రీశైలం సమీపంలో రామయ్య టర్నింగ్ వద్ద పోలీసు వాహనాలకు కూడా సందు లేకుండా పూర్తిగా రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో శ్రీశైలం వచ్చే భక్తులు వెళ్లే భక్తులు రోడ్లపై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు.

భక్తులు తమ వాహనాలు ఎటూ పోలేక ఆందోళన చెందుతున్నారు. నిన్న మహాశివరాత్రి పర్వదినం కావడంతో శ్రీశైలానికి లక్షలాదిగా భక్తులు సొంత కార్లలో బస్సులలో తండోపతండాలుగా క్షేత్రానికి తరలివచ్చార. మహాశివరాత్రి పర్వదినం ముగియడంతో శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం భక్తులు సొంత ఊర్లకు బయలు దేరారు. నిన్నటి వరకు పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పటికీ ఇవాళ భక్తులు తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ పూర్తిస్థాయిలో పెరిగిపోయింది. రోడ్లన్నీ కార్లు, బస్సులు, జీపులు, ఆటోలతో నిండిపోయింది.

శ్రీశైలం నుంచి ఇటు కర్నూలు- గుంటూరు రోడ్డులో భారీ వాహనాల రద్దీ పెరిగింది. అటు హైద్రాబాద్ రోడ్టులో కూడా వాహనాల రద్దీ బాగా పెరిగింది. దీంతో భారీ ట్రాఫిక్ జామ్ పెరిగింది. సుమారు మూడు గంటల నుంచి భక్తులు రోడ్లపై ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి పడిగాపులు పడుతున్నారు. ఓ పక్క ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ లో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికి ట్రాఫిక్ కంట్రోల్ చేయలేని పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం ఘాట్ రోడ్ లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. సాయంత్రానికి పరిస్థితి అదుపులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Read Also: MLA G Sayanna : ఎమ్మెల్యే సాయన్న మృతిపై సీఎం కేసీఆర్‌ సంతాపం