NTV Telugu Site icon

Heavy Rains: నేడు భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ! అస్సలు బయటకు రావొద్దు

Heavy Rains

Heavy Rains

Red Alert issued for Next Two Days in Hyderabad: రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరం అయితేనే బయటికి రావాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో బుధ, గురు వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

గత వారం రోజులుగా హైదరాబాద్ (Hyderabad Rains) నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు చిన్న చిన్న బ్రేక్‌లు ఇచ్చి.. వర్షం దంచి కొడుతోంది. కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు అన్ని ఇప్పటికే జలమయం అయ్యాయి. డ్రైనేజీలు కూడా పొంగిపొర్లుతున్నాయి. రోజూ కురుస్తున్న వర్షపు నీటితో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దాంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు గంటల తరబడి టాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు.

Also Read: Gold Today Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన పసిడి ధరలు!

ఇక బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జోన్ల వారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్‌ జోన్‌, ఎల్బీనగర్‌ జోన్‌, ఖైరతాబాద్‌ జోన్‌, శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఈ జోన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో 3 నుంచి 5 సెంమీ వర్షం కురిసే సూచనలున్నాయని, 10 సెంమీ. కూడా కురావొచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కిమీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయి కాబట్టి నగరంలో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

Also Read: Parliament: నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం!.. లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం