NTV Telugu Site icon

Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో దంచికొడుతున్న వానలు..

Rains

Rains

Heavy Rains in AP: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం.. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడుతుందని.. రెండు రోజుల తర్వాత ఒడిషా తీరానికి చేరుకుంటుందని.. దీని ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇక, రాగల 24 గంటల్లో ఏలూరు, అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు అతి భారీ వర్షాలు తప్పవని స్పష్టం చేసింది.. ఈ సమయంలో 19 సెంటీ మీటర్లకు మించిన వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది..

Read Also: Titan Celestor Smartwatch Price: ‘టైటాన్‌’ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. ధర ఎంతంటే?

ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి.. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, వియల్ పురం, హైటెక్ బస్టాండ్ తుమ్మలోవ, ఆదిమ్మ దెబ్బ, ఆర్యాపురం, రాజేంద్రనగర్ ఏరియాలో వర్షం నీరు నిలిచిపోయింది.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు మొరయించడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మోకాలు లోతు నీళ్లు నిలిచిపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షం నీటికి డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపైకి చేరుతున్నాయి.. దీనితో రహదారులన్నీ వర్షం నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు.. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది.. ఈ సమయంలో తీరం వెంబడి ఈదురు గాలులు పెరుగుతాయని.. రేపటి నుంచి గరిష్టంగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

Read Also: Minister Nara Lokesh: ఏ ఘటననూ ఉపేక్షించేది లేదు.. ఏ నిందితుడినీ వదిలేది లేదు..

మరోవైపు.. ఏలూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగాఎర్రకాలువ జలాశయం నుంచి నీటి విడుదల చేశారు అధికారులు.. జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ జలాశయానికి క్రమంగా వరద నీరు చేరుకుంటుంది.. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 81.01. మీటర్లకు చేరింది.. ప్రాజెక్ట్ లోకి ప్రస్తుతం 3 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్టు అధికారులు అంచనా వేశారు.. దీంతో.. రెండు గేట్లు ద్వారా దిగువ ప్రాంతాలకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టీఎంసీలుగా ఉంది..

Read Also: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌.. కెప్టెన్ రోహిత్ శర్మనే!

అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లో ఎడతెరపు లేని వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీఆర్ పురం మండలంలో అన్నవరం వాగు పొంగిపొర్లుతుంది. వంతెన తెగి రహదారిపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. సుమారు 20కి పైగా గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కూనవరం మండలంలో వాగు నీటిలో ఉపాధి కూలీలు చిక్కుకున్నారు.. టేకులబోరు గ్రామం నుండి బోదునూరు గ్రామానికి ఉపాధి హామీ పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. భారీ వర్ష కారణంగా వాగు పొంగి ప్రవహిస్తుంది.. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని సురక్షితంగా కూలీలు వాగు దాటారు..