Heavy Rain Alert: ఏపీ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Rainalert

Rainalert

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలతో పాటు పలు చోట్ల బలమైన ఈదురు గాలులు వీస్తూ, తీవ్రస్థాయిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వివిధ జిల్లాల తీవ్రతను బట్టి ముందస్తు జాగ్రత్తగా కలర్ అలర్ట్‌లను ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేశారు. అలాగే కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించారు. అటు తీర ప్రాంత జిల్లాలైన బాపట్ల, నెల్లూరుతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో పాటు భారీగా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు, కూలీలు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని, సురక్షితమైన పక్కా భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి చేసింది.

×
×
Ad