Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..

Rainalert

Rainalert

Hyderabad: భాగ్యనగరంలో వరుణుడు ప్రతాపం చూపించాడు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నగరంలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షం వల్ల అర్ధరాత్రి వేళ నగరవాసులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ఐటీ కారిడార్‌తో పాటు పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మణికొండ, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, పాతబస్తీ, చార్మినార్‌, యాకత్‌పురా, బహదూర్‌పురా, బీహెచ్‌ఈఎల్‌, పటాన్‌చెరు, మియాపూర్‌ వంటి ప్రాంతాల్లో గంటకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. షేక్‌పేట్ ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఫిలింనగర్ రోడ్డుపై ఎగువ ప్రాంతాల నుంచి ఇసుక, రాళ్లు కొట్టుకురావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే.. చందానగర్‌లో అత్యధికంగా 12.7 సెంటీమీటర్లు, రామచంద్రపురంలో 12.7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే లింగంపల్లిలో 12 సెంటీమీటర్లు, శివరాంపల్లిలో 10.1 సెంటీమీటర్లు, గచ్చిబౌలిలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. పటాన్‌చెరులో 7.6 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం కూడా రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు.

×
×
Ad