పర్యాటక నగరం విశాఖలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.. మాడు పగిలే ఎండకు నగర వాసులతో పాటు పర్యాటకులు కూడా ఇళ్ల నుండి హోటల్స్ నుండి బయటకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు.. వేడి వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. సాధారణ రోజుల కంటే వీకెండ్స్ ఆదివారాల్లో రద్దీగా ఉండే రోడ్లన్నీ బోసిపోయాయి.. ఉదయం 8-9 గంటల నుండే సూర్యుడు సూర్యుడు సుర్రు మనిపిస్తున్నాడు.. విశాఖలో భగ్గుమని మండుతున్న ఎండల తీవ్రంగా ఉన్నాయి. శనివారం ఏడు జిల్లాలలో దాదాపుగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా, బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లెలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా చోట్ల 41 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీప్రజలకు చల్లనివార్త చెప్పింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాలలో ఈ మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాల కారణంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గత పదిరోజులుగా పెరిగిన ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న జనానికి.. ఈ వార్త కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు.