గత కొద్ది రోజులుగా తీవ్ర వేడితో.. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తుంటే.. ఎండి వేడిమిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ.. కొన్ని రాష్ట్రాలకు హీట్ వేవ్ హెచ్చరికలు.. మరికొన్ని రాష్ట్రాలకు చల్లని కబురు చెప్పింది.
రాగాల 24 గంటలలో దక్షిణ భారతదేశానికి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక ఈశాన్య, వాయువ్య ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది. రాబోయే 24 గంటల్లో ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేడి తరంగాల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని.. ఆ తర్వాత తగ్గుతుందని చెప్పుకొచ్చింది.
ఇక కోస్తాంధ్ర, రాయలసీమ, యానాం, తెలంగాణ, కర్ణాటకలో ఏప్రిల్ 8, 9 తేదీల్లో హీట్ వేవ్ పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తేమతో కూడిన వాతావరణం మాత్రం ఉంటుందని చెప్పింది. అదే సమయంలో తూర్పు, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో చాలా చోట్ల తేలికపాటి/మోస్తరు వర్షపాతం/మంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 7 రోజుల్లో ఈ పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ 8 నుంచి 14 మధ్య కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. ఇక సోమవారం విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.