Heat Stroke: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండలు, వడగాలులు తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో వడదెబ్బ (Heat Stroke) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనల నేపథ్యంలో, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వడదెబ్బను “రాష్ట్ర విపత్తు”గా పరిగణిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా మాత్రమే అందించబడుతోంది. అయితే, ఇప్పుడు రాష్ట్ర విపత్తు సహాయ నిధి కింద ఆ మొత్తాన్ని రూ.50 వేలు నుండి రూ.4 లక్షలకి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వడగాలుల ప్రభావం నుంచి రక్షించుకోవడానికి స్థానిక అధికారులు జారీ చేసే ఆరోగ్య సూచనలను ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఎండలో ఎక్కువ సమయం గడపకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. వడదెబ్బ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి, సంబంధిత ఆరోగ్య శాఖలు, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నాయి. గ్రామ స్థాయి నుండి నగరాల వరకూ ఈ అవగాహన చర్యలు కొనసాగనున్నాయి. ఈ చర్యల ద్వారా ఎండల కారణంగా ప్రాణ నష్టాన్ని నివారించడమే కాక, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.