NTV Telugu Site icon

మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!

ప్రస్తుతం ప్రపంచం అతిపెద్ద గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.ఇప్పటివరకూ కోవిడ్ తో సతమతమైన ప్రపంచ దేశాలు.. అంతకన్నా అతిపెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ పేషెంట్.. క్లైమేట్ చేంజ్ వ్యాధి లక్షణాలతో అడ్మిటయ్యాడు. అతడి రోగ లక్షణాలపై పరిశోధన చేసిన డాక్టర్ మెరిట్..వాతావరణ మార్పుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.శ్వాస సమస్యతో వచ్చిన రోగిని పరిశీలించిన డాక్టర్ మెరిట్.. అతడు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు.

పేలవమైన గాలినాణ్యత, హీట్‌వేవ్.. రోగి లక్షణాలకు కారణమని తేల్చారు. ఇటీవల కూటేనస్‌లో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా రోగికి ఆస్తమా తీవ్రరూపం దాల్చడంతో… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా తెలిపింది. కార్చిచ్చు అధికంగా సంభవించే ప్రాంతాల్లో బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని కూటెనేస్ ఒకటి. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,600కు పైగా అగ్నిప్రమాదాలు జరిగాయని వైల్డ్‌ఫైర్ సర్వీస్ వెబ్‌సైట్ వెల్లడించింది. షుగర్, హార్ట్ ప్రోబ్లమ్స్‌ను హీట్‌వేవ్స్ పెంచాయని, ఇప్పటికే ఇలాంటి చాలా కేసులు చూస్తున్నట్లు ఈ ప్రాంతంలోని వైద్యులు చెబుతున్నారు.బ్రిటీష్ కొలంబియాలోని లిట్టన్ గ్రామంలో ఈ ఏడాది జూన్ 29న ఆల్ టైమ్ హై 49.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. వడగాడ్పుల కారణంగా వందలాది మంది చనిపోయారు. వాతావరణ మార్పుల కారణంగా… 2030 మరియు 2050 మధ్య ఏటా రెండున్నర లక్షల మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.