Health News: ఆరోగ్యంపై ప్రజలకు మరింత అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం కీలక చర్యకు ఉపక్రమించింది. ఎలా అయితే, “సిగరేట్” తాగితే ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక ఉంటుందో, అదే తరహాలో సమోసా, జిలేబీలు, పకోడీ, వడా పావ్, చాయ్ బిస్కెట్స్ వంటి స్నాక్స్‌కు కూడా ఆరోగ్య హెచ్చరికల్ని ప్రారంభించనుంది. ఈ వార్నింగ్స్ ఆహార పదార్థాల్లోని అధిక స్థాయిలో ఉండే నూనె, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌ని హైలెట్ చేస్తాయి. ఇవి అన్నీ కూడా జీవనశైలి వ్యాధులతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.
ఈ ప్రచారాన్ని మొదటగా నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS నాగ్‌పూర్) ఈ ప్రచారం ప్రారంభం కానుంది. క్యాంపస్‌లోని క్యాంటీన్లు, భోజనశాలల్లో ఈ ఆహారాల్లో ఉండే వాటిని బోర్డుల రూపంలో ప్రదర్శించనున్నారు. కౌంటర్ల పక్కన కస్టమర్లకు సులభంగా కనిపించే విధంగా, పెద్దగా ప్రకాశవంతమైన అక్షరాలతో ఈ వార్నింగ్స్‌ని ప్రదర్శిస్తారు.
భారతదేశంలో పెరుగుతున్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఊబకాయం, మధుమేహం, బీపీ, గుండె జబ్బులు పెరుగుతన్న కారణంగా పలు ఆహార పదార్థాలపై సిగరేట్ తరహా హెచ్చరికలు జారీ చేయనుంది. 2050 నాటికి, 440 మిలియన్ల మంది భారతీయులు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడే అవకాశం ఉందని ది లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించబడింది. ఇది నిషేధం కాదని, కేవలం ఆరోగ్య పరమైన అవగాహన కోసమే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే నెలల్లో ఇతర నగరాలకు కూడా ఈ హెచ్చరిక లేబుల్ ప్రచారం విస్తరించే అవకాశం ఉంది.