Site icon NTV Telugu

#HBDYSJagan: ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు.. ట్రెండింగ్‌లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్

Jagan

Jagan

#HBDYSJagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాయి వైసీపీ శ్రేణులు.. పెద్ద ఎత్తున సీఎం జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు ఆయన అభిమానులు.. ఏపీకే ఈ వేడుకలకు పరిమితం కాకుండా.. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు.. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సైతం.. ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్‌ చేశారు.. తమ అభిమాన నేత పుట్టిన రోజును వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్‌, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున కేక్‌లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకులు హాజరై భారీ కేక్ క‌ట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు. అటు జిల్లాల్లోనూ సీఎం వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఇదిలా ఉండగా తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలుపుతూ లక్షల్లో మేసేజ్‌లు వెల్లువెత్తడంతో ట్విట్టర్‌లో #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ ఏకంగా 20 గంటలపాటు X (Twitter) ట్రెండింగ్ లో ఉంది. అంతేకాకుండా ఇండియాలో నంబర్ వన్ గా నిలవడమే కాకుండా ఆసియాలో, ప్రపంచవ్యాప్తంగా టాప్ టెన్ లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్ నిలిచింది.

మరోవైపు.. వైఎస్‌ జగన్‌ పాలనను ప్రతిబింబించేలా ఇలస్ట్రేషన్ ఫొటో విడుదల చేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం.. సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తూ.. వారిని తన సొంతవారిలా అక్కున చేర్చుకుంటున్నారు అన్న థీమ్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అందులో ఓవైపు పచ్చని పంట పొలాలు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాల, గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను చేర్చారు. ఇక, ఈ చిత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version