Harry Brook Takes Stunning Catch at Boundary In The Hundred 2023: క్రికెట్ ఆటలో ప్లేయర్స్ తమ ఫీల్డింగ్ విన్యాసాలతో స్టన్నింగ్ క్యాచ్‌లు పడుతుంటారు. కొన్నిసార్లు కొందరు ఫీల్డర్లు ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుతూ క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకోవడం, ఒంటిచేత్తో క్యాచ్ పట్టడం ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించిన క్యాచ్ నమోదైంది. ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో బంతిని అందుకున్నాడు.
‘ది హండ్రెడ్’ టోర్నీలో భాగంగా మంగళవారం నార్తెర్న్ సూపర్ చార్జర్స్, వెల్ష్ ఫైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజీ (58), జానీ బెయిర్‌స్టో (44) చెలరేగారు. ఎస్కినాజీ పెవిలియన్ చేరినా.. జో క్లార్క్ (42) అండతో బెయిర్‌స్టో ధాటిగా ఆడుతున్నాడు. బ్రైడన్ కార్సే వేసిన 82వ బంతిని బెయిర్‌స్టో భారీ షాట్ ఆడగా.. సిక్స్ వెళ్లేలా కనిపించింది. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్.. గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్నాడు. సమన్వయం కోల్పోయిన బ్రూక్ తెలివిగా బంతిని గాల్లోకి వేసి బౌండరీ లోపలికి వచ్చి అందుకున్నాడు.
హ్యారీ బ్రూక్ మరోసారి బ్యాలెన్స్ కోల్పోవడంతో మళ్లీ బంతిని మైదానంలోకి విసిరి బౌండరీ దాటాడు. మైదానంలో ఉన్న ఫీల్డర్ ఆడమ్ హోస్ బంతిని అందుకున్నాడు. దాంతో జానీ బెయిర్‌స్టో పెవిలియన్ చేరక తప్పలేదు. ఇలా ఇద్దరు ఫీల్డర్లు కలిసి ఇదివరకు క్యాచులు పట్టినా.. ఇది మాత్రం అంతకు మించి అని చెప్పాలి. ఎందుకంటే బ్రూక్ రెండుసార్లు కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా చాకచక్యంగా బంతిని గాల్లోకి వేశాడు. అంతకష్టపడి బ్రూక్ క్యాచ్ పట్టినా.. క్రెడిట్ మాత్రం హోస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. బెయిర్‌స్టోని క్యాచ్ ఔట్ చేసింది హోస్. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.
Also Read: IND vs IRE: మూడో టీ20లో వరుణుడిదే విజయం.. సిరీస్ భారత్ సొంతం!
ఇక ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. 42 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ చరిత్రలోనే ఇది వేగవంతమైన సెంచరీ. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తెర్న్ సూపర్ చార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ సెంచరీతో రాణించాడు. అనంతరం వెల్ష్ ఫైర్ 90 బంతుల్లోనే 2 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది.
Brilliant from Harry Brook!
Video Courtesy: Northern Superchargers/Instagram pic.twitter.com/uLmNj64i7x
— Dialectical Guy (@dialecticalguy) August 23, 2023