NTV Telugu Site icon

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు బహిరంగ లేఖ

Harish Rao

Harish Rao

రాష్ట్రంలో గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ, పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహింగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్‌ రావు అన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం వంటి సమస్యలు తెలంగాణ విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా..’విద్యాశాఖకు కూడా నిర్వర్తిస్తున్న మీరు, రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల సమయంలో మీరు కొత్తగా చేసిందేమీ లేకుండా పోయింది. గత ప్రభుత్వం చేస్తున్నవి కొనసాగించడంలోనూ మీ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు, ప్రభుత్వ పాఠశాలలకు శాపంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ అనే మహోన్నత కార్యక్రమాన్ని ప్రారంభిస్తే, మీరు దాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. కొని పాఠశాలలో విద్యార్థులకు సన్నబియ్యానికి బదులు ముక్కిన బియ్యంతో భోజనం పెడుతున్నారు. విద్యార్థుల పౌష్టికాహారం కోసం అందించే కోడి గుడ్ల బిల్లులు సైతం చెల్లించని పరిస్థితి ఏర్పడింది. రెండు జతల స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా ఒక్క జత బట్టలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది మీ ప్రభుత్వం. ఒక్క విద్యార్థి కూడా ఆకలితో అలమటించవద్దనే మనవతా దృక్పథంతో గత ప్రభుత్వం 27 వేల పాఠాశాల్లలో ప్రారంభించిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. మరోవైపు సకాలంలో వేతనాలు అందక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పాఠశాలల్లో దోమలు, ఈగలు ముసురుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో సిలబస్ ప్రకారం, పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారింది. కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో అంధకారం అలుముకుంటున్నది.
పాఠశాల విద్యావ్యవస్థను ఇన్ని సమస్యలను చుట్టుముట్టినా మీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం బాధాకరం. భావిభారత పౌరులను తయారుచేసే పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేయడం విద్యాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లేమికి నిదర్శనం. మీరు ఇప్పటికైనా స్పందించి తక్షణమే పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, సమస్యలను పరిష్కరించాలని బహిరంగ లేఖ ద్వారా కోరుతున్నాను.’ అని ఆయన అన్నారు.

1. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏడు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలి.
2. ఏడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న భోజన బిల్లులు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలి.
3. ఎస్జీటీల బదిలీల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పడ్డ సుమారు 9 వేల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి.
4, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ సరఫరా చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి.
5. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తామన్న సిబ్బందిని వెంటనే నియమించాలి.
6. విద్యార్థులకు ఒక్క జత బట్టలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, రెండు జతల బట్టలు అందించాలి.
7, విద్యార్థుల ఆకలి తీర్చే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలి.
8, సర్వశిక్షా అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ నాలుగు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. అని లేఖలో హరీష్ రావు కోరారు.