Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

Harish Rao

Harish Rao

Harish Rao: రేవంత్ పాలనలో రైతుల చేతులకు బేడీలు వేయడం, పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టడం పరిపాటిగా మారడం సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు. ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. మీ చేతగాని తనం వల్ల ఈరోజు పంటలకు నీళ్లు అందక ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ మేరకు తాజాగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కడుపు మండిన రైతన్న రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? పోలీసులను ప్రయోగించి భయబ్రాంతులకు గురి చేస్తారా? ఇదెక్కడి దుర్మార్గం? ఇదెక్కడి అన్యాయం? అని హరీశ్ రావు ప్రశ్నించారు.

కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం వహించింది మీరు.. నీళ్లను ఒడిసి పట్టకుండా, విడిచిపెట్టి తెలంగాణకు జల ద్రోహం చేసింది మీరంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులపై మాజీ మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, శిక్ష రైతులు అనుభవించాలా? అని నిలదీశారు. సాగునీళ్లు లేక, కరెంట్‌ లేక రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే.. పరిష్కరించాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఇది ప్రజా పాలననా? లేక ప్రజా పీడననా? రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే, పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.