రాష్ట్రమంతా సమస్య ఉంటే అది సాంకేతిక పొరపాటు కాదు, విధానపరమైన తప్పిదమేనని బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు తేల్చి చెప్పారు. ఎన్టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు, అవైజ్ఞానిక నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 22A నిరోధిత జాబితా భూముల సమస్య తీవ్ర రూపం దాల్చిందని ఆరోపించారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి అధికారులతో అరకొర నివేదికలు తెప్పించుకోవడం వల్లనే లక్షలాది మంది ప్రజలు, రైతులు తమ పట్టా భూములను కోల్పోయి ఆగమవుతున్నారని ఆయన మండిపడ్డారు.
అధికారుల లోపం వల్లనే 22A సమస్య ఉత్పన్నమైందని, దీని వెనుక బీఆర్ఎస్ నాయకుల హస్తం ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తాము రక్షణలో పడ్డప్పుడల్లా ఇలాంటి ఆరోపణలు చేయడం అలవాటుగా మార్చుకుందని విమర్శించారు. ఒకవేళ అధికారులే తప్పు చేసి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చి నెల రోజులు దాటినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, సస్పెండ్ ఎందుకు చేయలేదు అని నిలదీశారు. ప్రతీ చిన్న విషయానికి సీఐడీ, సిట్, విజిలెన్స్ విచారణలకు ఆదేశించే ఈ ప్రభుత్వం, లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న 22A భూముల స్కామ్‌పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. తప్పు ప్రభుత్వ పెద్దలదే కాబట్టి అధికారులపై చర్యలు తీసుకునే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
ఈ ఇష్యూలో అధికారులు కేవలం నిమిత్తమాత్రులని, ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలను మాత్రమే వారు అమలు చేశారని హరీష్ రావు అన్నారు. 22A గందరగోళానికి అసలు ముద్దాయిలు రేవంత్ రెడ్డి (A1), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (A2) అని ఆరోపించారు. మహబూబాబాద్ వంటి ప్రాంతాల్లో పర్యటించి తహసీల్దార్ల మీద “తోలు తీస్తా” అంటూ గరం గరం అవుతున్న మంత్రి పొంగులేటిని ఉద్దేశించి మాట్లాడారు. స్వయంగా ప్రభుత్వమే ఆదరాబాదరాగా 22A జాబితాలు పంపాలని ఒత్తిడి తెచ్చి, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా పాత లిస్టులను అప్‌లోడ్ చేయించడం వల్ల ఈ సమస్య ఏర్పడితే, ఇప్పుడు అధికారులను బలిపశువులను చేయడం సరికాదన్నారు.
ధరణి పోర్టల్ ద్వారానే 22A సమస్య వచ్చిందన్న ఆరోపణలను హరీష్ రావు ఖండించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006లో సబ్ రిజిస్ట్రేషన్ శాఖను ఆటోమేషన్ చేసేందుకు ‘కార్డ్’ (CARD) ప్రాజెక్టును తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఆ సమయాన్నే ప్రభుత్వ భూములు, ఎండోమెంట్స్, వక్ఫ్ భూములను డిజిటలైజ్ చేసి నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెచ్చిన ధరణి పోర్టల్‌ను, అప్పటికే ఉన్న కార్డ్ ప్రాజెక్టు డేటాతో అనుసంధానం మాత్రమే చేశామని, తాము కొత్తగా ప్రజలను ఇబ్బంది పెట్టే జాబితాలను తయారు చేయలేదని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల నుంచి అడ్డగోలుగా నివేదికలు తెప్పించి కొత్త డేటాను అప్‌లోడ్ చేయడం వల్లే అసలు సమస్య ప్రారంభమైందని స్పష్టం చేశారు.
కాలనీలకు కాలనీలు, దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను 22A పరిధిలోకి తీసుకురావడం దారుణమన్నారు. ఖమ్మం, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో ఎందరో రైతులు, సామాన్యులు తమ భూములను ఆన్‌లైన్ జాబితా నుంచి తొలగించుకోవడానికి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాల వల్ల ఏర్పడిన ఈ సమస్యను పరిష్కరించడానికి వెంటనే సర్వే నంబర్ల వారీగా రీ-వెరిఫికేషన్ చేపట్టి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని హెచ్చరించారు.

