టీమిండియా వెటరన్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రంజీ ట్రోఫీ 2023లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో విహారి.. విరిగిన మణికట్టుతో బ్యాటింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విహారి మణికట్టు విరగడంతో లెఫ్టాండ్ బ్యాటింగ్ చేశాడు. దాంతో అతని పోరాట పటిమను అందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా దీనిపై విహారి స్పందించాడు. జట్టులో గెలవాలనే కసిని పెంచడానికే తాను రిస్క్ చేసి బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు.
Also Read: INDvsAUS Test: భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!
“నా ఎడమ చేతి మణికట్టు విరిగింది. డాక్టర్లు బ్యాటింగ్ చేయవద్దని సూచించారు. మా టీమ్ ఫిజియో కూడా బ్యాటింగ్ చేయడం కుదరదని చెప్పాడు. కానీ వికెట్లు పడిపోతున్నప్పుడు, ఒంటి చేత్తో లెఫ్టాండ్ బ్యాటింగ్ ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన వచ్చింది. 10-15 బంతులాడి.. మరో 10 పరుగులు చేసినా గొప్పవిషయమే అనిపించింది. అంతేకాకుండా విజయం కోసం పోరాడాలనే తన ఉద్దేశ్యం టీమ్‌కు అర్థమవుతుందనిపించింది. నేను వదిలేస్తే టీమ్‌లో నిరాశ నెలకొంటుంది. నేను పరుగులు చేయకున్నా.. తొలి బంతికే ఔటైనా.. గాయంతో బ్యాటింగ్‌కు సిద్దమయ్యాననే స్పూర్తి మా ఆటగాళ్లకు కలుగుతోంది. టీమ్ స్పిరిట్ పెంచేందుకు ఓ ఉదహారణగా నిలవాలనే ఈ రిస్క్ చేశాను. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్ ఫలితం తేలుతుందని అనుకోవడం లేదు. ఇది ఐదు రోజుల గేమ్. ప్రతీ సెషన్ ముఖ్యమే” అని విహారి తెలిపాడు.
What a champion. Always putting team ahead of himself. Shows the commitment. Super proud of you bro. @Hanumavihari #AndhravsMP pic.twitter.com/NTRBh3dCfk
— Basanth Jain (@basanthjain) February 1, 2023
ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు ముందు బ్యాటింగ్ చేయగా.. మధ్యప్రదేశ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో విహారి గాయపడ్డాడు. అతను విసిరిన బౌన్సర్ విహారి ఎడమ చేతి మణికట్టుకు బలంగా తగలడంతో అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే 323/2తో పటిష్టంగా కనిపించిన ఆంధ్ర .. 30 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. దాంతో విరిగిన చేతితోనే విహారి ఆఖరి వికెట్‌గా మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. లెఫ్టాండ్ బ్యాటింగ్ చేస్తూ 20 బంతులాడి ఒంటి చేత్తోనే రెండు బౌండరీలూ బాదాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన తరువాత ఔటయ్యాడు. ఇక విహారి మణికట్టులో చీలిక వచ్చిందని, గాయం నుంచి కోలుకునేందుకు 5-6 వారాల టైమ్ పడుతుందని వైద్యులు సూచించినట్లు ఆంధ్ర జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Misbah Ul Haq: పీసీబీ నిర్ణయం సిగ్గుచేటు: మాజీ ప్లేయర్ విమర్శలు