టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్రం దృష్టి పెట్టాలన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు ఎలా ప్రవర్తించారో, అప్పుడు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. అప్పట్లో ఏపీలోకి అడుగుపెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అర్హత లేదని చంద్రబాబు అన్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఏం ముఖం పెట్టుకుని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తారని జీవీఎల్ నిలదీశారు.
గతంలో ఏపీలో చోటుచేసుకున్న అనుభవాలను టీడీపీ మరిచిపోయినా బీజేపీ ఇంకా మరిచిపోలేదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గతంలో చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను వివరించేందుకు శనివారం నాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను చంద్రబాబు కలిసే అవకాశాలున్నాయి.