గుంటూరు తూర్పు నియోజక వర్గం, ఆర్టీసీ కాలనీలో టీడీపీలో బయటపడ్డ వర్గ విబేధాల ఘటనలో కేసు నమోదు అయింది. టీడీపీలోని ఒక వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడానికి ప్రయత్నం చేసిందని, తన మీద కూడా దాడికి వచ్చారని మహిళా కార్యకర్త మొవ్వ శైలజ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర ఉపాధ్యక్షుడు ఫిరోజ్‌తో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
టీడీపీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడంతో పాటు దాడి చేసుకునే యత్నం చేశారని ఫిర్యాదు అందిందని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని గుంటూరు పోలీసులు చెప్పారు. కాగా ఈ ఘటనపై టీడీపీలోని రెండు గ్రూపులు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో స్థానిక టీడీపీ మహిళా నేతలు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యేను టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, డివిజన్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.