NTV Telugu Site icon

Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Gujarat

Gujarat

Gujarat Polls: గుజరాత్‌ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కచ్-సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లోని 19 జిల్లాల్లో 89 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు 2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్షించారు. అమ్రేలిలో హస్తం పార్టీ ఎమ్మెల్యే పరేశ్‌ ధనాని.. సైకిల్‌కి సిలిండర్‌ కట్టుకుని తన కుటుంబ సభ్యులతో ఓటేయడానికి వెళ్లారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్పీజీ సిలిండర్‌ ధరలు భారీగా పెరిగాయని దానిపై రాశారు.

ఇదిలావుండగా, ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతులకు రుణమాఫీ, రాష్ట్ర ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గుజరాత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.‘గుజరాత్ సోదర సోదరీమణులందరికీ విజ్ఞప్తి… ఉపాధి, చౌక గ్యాస్ సిలిండర్లు, రైతుల రుణమాఫీ, గుజరాత్ ప్రగతిశీల భవిష్యత్తు కోసం ఓటు వేయండి’ అని గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.

ఇలా బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఓటర్ల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నది. గుజరాత్ నేడు ప్రజాస్వామ్య పండుగ జరుపుకుంటుందని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈ రోజు, డిసెంబర్ 5న జరిగే గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తరుపున విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ఈ సారి 4.9 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. రెండు దశాబ్ధాలుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో, కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది. ఈ సారి మాత్రం రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. పంజాబ్ రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆప్ గుజరాత్ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది.