Site icon NTV Telugu

Gudivada Amarnath: ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

Gudivada Amarnath

Gudivada Amarnath

Gudivada Amarnath: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.. ఇక, ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలన్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చినా.. ఎందుకు ప్రజల ఆదరణ లభించ లేదో తేల్చుకోవాలన్నారు. వ్యవస్థల్లో తెచ్చిన మార్పులు, సంస్కరణల కారణంగా పార్టీ కేడర్ కు గౌరవం దక్క లేదు.. నాయకత్వం, కేడర్ ను నిర్లక్ష్యం చేయాలనే ఉద్దేశం లేకపోయినా.. ప్రభుత్వం – పార్టీ మధ్య దూరం పెరిగిందన్నారు. పథకాలు, పరిపాలన ప్రజల ఇంటికే తెచ్చిన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థలను ప్రవేశ పెట్టినా.. ఎందుకు గెలవలేకపోయామోసమాధానం వెతుక్కోవాలన్నారు.

Read Also: JD Lakshmi Narayana: ప్రత్యేక హోదాయే మార్గం.. ఇప్పుడు అవకాశం వచ్చింది..

ఇక, ప్రభుత్వం మారిన 48 గంటలు తిరగక ముందే రాష్ట్రంలో దాడులు పెరిగాయి అని ఆవేదన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్.. వైసీపీకి ఓటేశారనే కక్షతో ఇళ్లకు వెళ్లి మరీ కొడుతున్నారు.. కానీ, దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు.. ‘వాయిస్ ఆఫ్ ది వాయిస్ లెస్’ అనే మా అధినాయకుడు చెప్పిన మాటకు కట్టుబడి ప్రజా సమస్యలపై మా పోరాటం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమస్యలు, ప్రజా అవసరాల కోసం పొరాడతాం.. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి ఏడాది సమయం ఇస్తాం.. హామీలు నిలబెట్టు కోకపోతే ప్రభుత్వాన్ని ఎండగడతాం అన్నారు. కాగా, 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన గుడివాడ అమర్నాథ్.. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో చివరి రెండేళ్లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో ఆయన్ను గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది వైసీపీ.. అయితే, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేతిలో గుడివాడ అమర్నాథ్ ఓటమిపాలైన విషయం విదితమే.

Exit mobile version