ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హార్దిక్‌కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్‌ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్‌లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా హార్దిక్ నిలిచాడు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమైన విషయం తెలిసిందే. గత సీజన్‌లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో.. ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో చెన్నైతో మ్యాచ్‌లో హార్దిక్ బరిలోకి దిగలేదు. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడింది. మరో రెండుసార్లు ఇదే రిపీట్ అయితే.. భారీ జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఆడిన రెండు మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై.. గతేడాది లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు పరాజయాలతో పట్టికలో వెనకపడిపోయింది. ఇప్పటికైనా పుంజుకోకుంటే మరోసారి నిరాశ తప్పదు.