NTV Telugu Site icon

Marriage: పెళ్లి కోసం వరుడి పాట్లు.. 28కి.మీ నడిచి వధువు ఇంటికి.. ఎందుకంటే?

Groom

Groom

Marriage: పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు. ఈ ఘటన ఒడిశాలోని కల్యాణ్ సింగపూర్ బ్లాక్ పరిధిలోని సునాఖండి పంచాయతీలో చోటుచేసుకుంది. సాయంత్రం ఆరు గంటలకు నడక ప్రారంభించిన వీరు.. వేకువజామున మూడు గంటలకు వధువు ఇంటికి చేరుకున్నారు. బుధవారం నుంచి ఒడిశాలోని డ్రైవర్లంతా సమ్మె చేస్తున్న కారణంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. దీంతో వరుడు, అతడి కుటుంబసభ్యులు చేసేదేమీ లేక నడుచుకుంటూ పెళ్లికి వెళ్లారు. వీరంతా రాత్రిసమయంలో నడుస్తూనే వధువు ఇంటికి వెళ్లారు.

రాయగడ జిల్లాలోని కల్యాణ్‌ సింగ్‌పుర్ బ్లాక్​లోని సునాఖండి పంచాయతీకి చెందిన రమేష్ అనే యువకుడికి, దిబలపాడుకు గ్రామానికి చెందిన యువతితో పెళ్లి ఖాయమైంది. శుక్రవారం వధువు ఇంటి వద్ద.. వీరి విహహం జరిగింది. ఈ పెళ్లి కోసం నాలుగు వాహనాలను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రంలోని డ్రైవర్లు సమ్మె చేయడం వల్ల.. వాహనాల్లో వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో కాలినడకనే వధువు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. సమ్మెతో పెళ్లి కొడుకు తరఫున వారంతా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

Read Also: Cow Cess: మందుబాబులకు షాక్‌.. మద్యం అమ్మకాలపై కౌ సెస్‌..

శుక్రవారం ఉదయం పెళ్లి అనంతరం వరుడి కుటుంబసభ్యులు వధువు ఇంటివద్దే బస చేశారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. సాయంత్రం డ్రైవర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె ముగిసింది. దీంతో వారి ప్రయాణానికి సుగమమైంది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్‌ చేస్తూ డ్రైవర్‌ ఏక్తా మహాసంఘ్‌ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు.

Show comments