కాసేపటి క్రితం జూబ్లీహిల్స్‌లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం పండుగ, కుటుంబ సభ్యులకు సంబంధించిన సమావేశం అని అన్నారు. రాజకీయ నాయకులం కాబట్టి రాజకీయ పరమైన సంభాషణ కూడా జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చించామని పేర్కొన్నారు. మేయర్ పై అవిశ్వాసంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించామని తెలిపారు.
Read Also: JanaSena Party: డిప్యూటీ సీఎం అంశం… జనసేన కీలక ఆదేశాలు..
మరోవైపు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని తలసాని శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ తీరుపై చర్చించాం.. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో వాళ్లు గీత దాటితే.. తాము కూడా గీత దాటాల్సి వస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామంటే తాము వద్దనడం లేదని తెలిపారు. కానీ అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్ట్రీట్ వెండర్స్‌ను ఆదుకుంటామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది.. కానీ ప్రస్తుతం స్ట్రీట్ వెండర్లను తొలగించడం చూస్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Read Also: Stock Market: మార్కెట్‌పై ట్రంప్ ఆశలు గల్లంతు.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
కాగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది. అంతేకాకుండా.. కాంగ్రెస్ ప్రకటించి నెరవేర్చని హామీలపై చర్చ కొనసాగింది. ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, రైతు భరోసా అంశాల్లో ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సుదీర్ఘ చర్చ జరిగింది. కుటుంబ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చే అంశాన్ని చర్చించినట్లు సమాచారం.